పుట:కాశీమజిలీకథలు -02.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

228

కాశీమజిలీకథలు - రెండవభాగము

నంపుచు నెట్లయినను, గార్యసాఫల్యము చేసికొని రండని పలికినది. బలభద్రుడు హరిదత్తుడున్న మేడమీదకు బోయెను. అందు నాయనా! మా మాటవినుము. నీ మతిభ్రమించి యిట్లనుచున్నావు. నీ పుత్రకు నెత్తికొనుము. అపుత్రకుడైన యీరాజు రాజ్యభారము వహింపుమని బ్రతిమాలుచున్న మంత్రులతో మీరెన్ని చెప్పినను నాకు సమ్మతికాదు. రాజలోభంబున జేసి పరకాంతను గళత్రముగా స్వీకంచి నరకయాతనల నెవ్వడనుభవింపగలడు. నాదారినన్ను బోనీయుడు. నామూలమున నొక పురుషుడు చిక్కులు పడుచుండును. నాకు మతిభ్రమ పుట్టి బందీగృహంబుననుండి తప్పించుకొని వచ్చితిని. మీకు బదివేలనమస్కారములు కావించెదను విడువుడు విడువుడు. అని వేడుకొనుచున్న హరిదత్తు మాటలు విని అచ్చటివారెల్ల నతనికి బిచ్చియెత్తినదని నిశ్చయించిరి.

అట్టిస్థితిలోనున్న హరిదత్తునిం జూచి బలభద్రుడు దాపునకుబోయి, మిత్రమా! నే నెవ్వడనొ యెరుంగుదువా? అని యడిగెను. అతండును నిదానించి అయ్యో! నిన్ను మరచిబోవుదునా? నా ప్రాణము గాపాడినవాడవు నీవేకదా? నా మూలమున మీరచ్చట జిక్కులు పడుచున్నవారు కాబోలు. వీరు నన్నిచ్చట నిది నీభార్య వీడు నీపుత్రుడు అని కదలనీయక నిర్బంధింపుచున్నవారు. వీరి నిదివరకు నేను గని విని యెరుంగను. నీవైనను వీరితోజెప్పి నన్ను విడిపించి తీసికొని పొమ్మని పలుకగా విని యతండును నతని యాకారవిశేషముజూచి అదృష్టదీపునికిని నతనికి నించుకేనియు భేదము లేనందునకు వెరగందుచు నెరగనివారు వీనినతడుగా భావించుట కేమియబ్బుర మని యాలోచించి జిరునవ్వు మొగంబలంకరింప నల్లన యిట్లనియె.

మిత్రమా! నీవు మమ్ము దాకట్టుపెట్టి పారిపోయివచ్చితివి. మమ్మువా రురి దీయుటకు సిద్ధపడినంతలో దైవకృపచే మిత్రగుప్తుడు ప్రియంవద యిచ్చిన ప్రశ్నలకు సమాధానము చెప్పెను. దానంజేసి మా మరణము తప్పినది. నీవు సంతోషముతో నుండుమని చెప్పుచు నీతో కొన్ని రహస్యవచనములు చెప్పవలసి యున్నవి. వివిక్తమునకు రమ్మనికోరిన నచ్చటి వారందరు వేరొక చోటికి బోయిరి. పిమ్మట బలభద్రుండతని జేరదీసికొని కన్నుల నానందబాష్పములు గ్రమ్మ, తమ్ముడా! నీ వృత్తాంతమే నీవెరుంగకున్నావు. నిన్ను వీరిట్లు నిర్బంధించుటకు వేరొక కారణమున్నది.

ఈ కాంతిమతిని నీ అన్నగారు గాంధర్వంబున గళత్రముగా స్వీకరించెను. అతండు వీరికి దెలియకుండ వేరొక కారణమునం బారిపోయెను. నీకును నీ యన్నకును నింతయేని భేదములేదు. నేను నీ యగ్రజుని మిత్రుడను. నిత్యముజూచుచున్న నేనుగూడ మీ తారతమ్యము గనిపెట్టలేనని చెప్పవచ్చును. నిన్నతనిగా భావించి వీరింతగా నిర్బంధించుచున్నవారని పలుకగా నతండు తెల్లపోయి యేమేమీ? నీమాటలు మరియు వింతగా నున్నవే! నాకు సోదరుడు లేడే? నీ మాటలెట్లునమ్ముదును? నా దత్తజనకునికి గొన్ని దినములకు మరియొక కుమారుడు గలిగెను. వాడు నాకు