పుట:కాశీమజిలీకథలు -02.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హరిదత్తుని కథ

227

వతినింగూడ తాను వచ్చుదనుక నచ్ఛటనే యుండ నియమించి కాంతిమతియొక్క చెలికత్తె యగు నిపుణిక యింటివీథిని బోయెను.

నిపుణికయు మేడమీదనుండి యతనిం జూచి గురుతుపట్టి వాని దోడితేర నొకశుకవాణి నంపినది. అదియు నతనిదారి కడ్డము వచ్చి, అయ్యా! మిమ్ము నీయింటి యజమానురాలు నిపుణిక యనునది యొకసారి లోపలకు దయచేయుటకు కోరుచున్నదని వేడగా నతండును సంతోషముతో దానిమేడమీదికి బోయెను. నిపుణికయు నతని కెదురేగి యుచితమర్యాదలు గావించి గద్దియనిడి కూర్చున్న తరువాత మెల్లగా నిట్లనియె. ఆర్యా! నీవు నీ మిత్రునితో విడి యెచ్చట నుంటివి? ఇచ్చటికెప్పుడు వచ్చితివి? నీ మిత్రుడు మునుపటిరీతి గాక మాపై గృపదక్కియున్నవాడు వింటివా? అతండెన్నడును మమ్ము జూచి యెఱుగడట. అతని కొఱకు మా నెచ్చెలి పడిన యిడుములన్నియు నీ వెఱింగినవేకదా! ఆ రాత్రి అతం డుద్యానవనములో జిక్కుపడిన తరి నా చెలి పాము గరచెనని యెంత కపట మభినయించినది.

అది యంతయు మరచి మీ రెవ్వరో నేనెరుగనని దుష్యంతునివలె ద్రోసి వేయుచున్నవాడు. యెంత చెప్పినను నొప్పుకొనడు. అతడు చివర మాకు వ్రాసిన యుత్తరము నీవేకదా తీసికొని వచ్చితివి? అదియు దానెరుగడట. తనపేరు సైతము మరియొకరని చెప్పుచున్నాడు. మీరు వెళ్ళినతరువాత గర్భవతియగు కాంతిమతి వృత్తాంతము విని మారాజు మంచి మగని సంపాదించుకొనెను. సంతోషముతో గూతునేమియు ననక పుంసవనసీమంతాతి కృత్యములు యధాశాస్త్రముగా జరిపించెను.

కాంతిమతియు బదియవమాసంబున జక్కని పుత్రుం గనినది. మారాజు గారిచే బంపబడిన దూతలు నీస్నేహితుని వెదకి పట్టుకొని తీసికొనివచ్చిరి. కాంతిమతియు సిగ్గు విడచి తన పుత్రుని జూపుచు బోలికిబట్టియైనను నమ్ముమని యెంత బ్రతిమాలినను నతండధర్మ భీరువువోలె సమ్మతింపకున్నవాడు. ఆ శిశువుగూడ నచ్చుగా నతని పోలికగానుండెను. ఇప్పుడు మా రాజుగా రా పిల్లవానికి జాతక కర్మాది సంస్కారములు చేయవలయునను సంతోషముతో నానాదిక్కులకు వర్తమానము చేసెను. పెక్కండ్రు విద్వాంసులు, బ్రాహ్మణులు వచ్చియున్నారు. పీటలమీద గూర్చుండుటకు నీ మిత్రుడు సమ్మతింపకున్న వాడు. నీవు సమయమునకు వచ్చితివి. చక్కగా బోధించి యీ కార్యము జక్క పరుపుమని వినయముగా బ్రార్ధించిన విని యతండు నవ్వుచు దాని కిట్లనియె. నిపుణికా! ఈశ్వరసృష్టి కడు చిత్రమయినది. పురుషునింబోలిన పురుషుం డుండుట సహజము కదా ! అట్టి వైపరీత్య మేదియేని జగినదేమో విచారించితివా! యెంత వెర్రిడివాడుగాని యూరక నే నెరుగననిన పూర్వపరిచయము గల వనితను నిరసించునా?

అతండెచ్చటనున్న వాడో చెప్పుము. నేనును బోయి మాట్లాడి వచ్చెదనని పలుకగా సంతోషింపుచు నతని కతని మేడజూపుటకై తన పరిచారికలలో నొకదాని