పుట:కాశీమజిలీకథలు -02.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

226

కాశీమజిలీకథలు - రెండవభాగము

ఆయన యొడిలో బాలకు డున్నట్లే యున్నది. నేనట్లు వడిగా బోయి చూచువరకు నచ్చట సునంద లేదు. గురుతులు మాత్రమున్నవి అడుగులజాడబట్టి యా యరణ్యములో గొంతదూరము దిరిగి యామె కొరకు గొంతెత్తి యరచితిని కాని యెందును నా సునందజాడ దెలిసినది కాదు. మరలవచ్చి యడవి యంతయు వెదకి నిరాశ జేసికొని దైవోపహతులమగు మాకు సమాగమ మెట్లు లభించునని యదిమొదలు బ్రతి గ్రామము, ప్రతి పట్టణము, ప్రతి పల్లెయు వెదకుచు భూమియంతయు దిరుగుచుంటిని. వారిజాడ యేమియుం దెలియలేదు.

రాజకుమారు నెత్తుకొని మరియొక మార్గమునం బోయిన నింబవతిజాడయు దెలిసినది కాదు. ఆ రాజకుమారు లిప్పటికి మంచి ప్రాయములో నుందురు. ఇప్పుడీ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు నేను వింటిని. హరిదత్తుడు మా రాజపుత్రుడు. వానిని జూచితినేని నా యాత్రమంతయుంబోవును. ఆ బ్రాహ్మణుడెచ్చట నున్నవాడో చెప్పుడు. నేను బెద్దదానను. మీకు మిక్కిలి పుణ్యము వచ్చునని చెప్పగా చిని బలభద్రుడు మరియు వెఱగందుచు నిట్లు తలంచెను. ఆహా! జగంబంతయు దైవాయత్తమై యున్నది. భగవదాజ్ఞ లేక పురుషుడు నిట్టూర్పు నిగుడ్చుటకయినను స్వతంత్రుడు కాడు. నియతిబలము లేక నేకార్యము సమకూడదు. మా మిత్రున కిప్పుడు మంచి దినములు వచ్చుచున్నట్లు తోచుచున్నది. నింబవతి తీసికొనిపోయిన బాలుడు నా మిత్రుడే హరిదత్తుడు సునందకన్న బిడ్డడు అని తోచుచున్నది.

ఇప్పుడు నా మిత్రుడు అదృష్టదీపు డీమాటవినినచో నెంత సంతసించునో అని అనేక ప్రకారముల విత్కరించుచు నా వృద్ధతో నిట్లనియె. అవ్వా! నీవు చింతింపకుము. నీ వాప్తులతో గొలదికాలములో గలిసికొందువు. నేను మీ రాజుగారి పెద్దకుమారుని మిత్రుడను అతడు కుశలముగా నున్నాడు. నింబవతియను దాది అతని నెత్తుకొని పోయినదని నీవు చెప్పితివి గదా! ఆ దాది యొక యరణ్యములో నా బాలుని బెట్టుకొని చెట్టుక్రింద బరుండియుండగా బాముగరచి మృతినొందెను. పశువుల గాచు పిల్లవాండ్రు, దాని శవముపైకెక్కి రోదనము చేయుచున్న యా చిన్నవాని నెత్తుకొని యీ ప్రాంతమందున్న పల్లెకు వచ్చిరి. అపుత్రకుండైన యొక గొల్లవాడు వానిని బెంచి పెద్దవానిని జేసెను.

అతండిప్పుడు మిక్కిలి గౌరవస్థితిలో నున్నవాడు. నీవు చెప్పిన హరిదత్తుడును నుత్తమస్థితికి రాగలడు. తల్లిమాత్ర మెచ్చట నున్నదో తెలియవలయు. వీరిరువురు శీఘ్రకాలములో దండ్రిచెఱ విడిపించి తమ రాజ్యముగైకొని భూచక్ర మంతయు నేలగలరని వక్కాణించుటయు నమృతప్రాయములైన అతనిమాటలు విని యావృద్ధ సంతోషహృదయంబున మునిగి దేలుచుండెను. బలభద్రుడా వృద్ధ కాంతతో నిష్టగోష్టివినోదమున నారాత్రి గడపి యుదయంబున లేచి యా బ్రాహ్మణుని రత్న