పుట:కాశీమజిలీకథలు -02.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హరిదత్తుని కథ

225

బ్రహ్మా:- ఏమో! అతనికి నేను జ్ఞాపకముందునా? వాడు మట్టివాడు కాడు.

రామ :- అఘటనఘటనా సమర్ధుడు భగవంతు డేమిచేసినం జేయగలడు. ప్రొద్దున విచారింతము. పరుండునప్పుడు ప్రొద్దుపోయినదని యొండొరులు సంభాషించుకొని నిద్రపోయిరి.

ఆ మాటలన్నియు విని బలభద్రుండు విస్మయము జెందుచు మేలు మేలు. వీరివలన మంచివార్తయే వినబడినది. హరిదత్తుడు రాజకుమారుడని తోచుచున్నది. రూపసాదృశ్యమునుబట్టి చూడగా నదృష్టదీపునికి సోదరుండని నిశ్చయింపవచ్చును. సన్యాసి చెప్పినమాట యెప్పుడు నసత్యము కానేరదు. అదృష్టదీపునికి హరిదత్తునందు నిర్హేతుకమైన ప్రేమ జనించినది. అదియే బాంధవ్యమును దెలుపుచున్నది. కాంతిమతి యతని నదృష్టదీపుడని భ్రమజెందుట కేమి యాశ్చర్యము! నేనుగూడ నతడే అని భ్రమజెందితిని. వీరి యనుమానమంతయు దీర్చి హరిదత్తుని ప్రియంవదతో గూర్చెద నిదియే కదా యదృష్టదీపుని యభిలాష నేనిట్టి పని చేసితినేని నా మిత్రుడు నన్ను మిక్కిలి మన్నించునని యనేక ప్రకారముల నాలోచించు సమయంబున నచ్చట నొక మూల బరుండి యా మాటలన్నియు వినుచున్న యొక వృద్ధకాంత మెల్లగా లేచివచ్చి అయ్యా ! తమరెవ్వరు హరిదత్తునికథ చెప్పిన బ్రాహ్మణు డెచ్చట నున్నాడని బలభద్రు నడిగినది.

బలభద్రుడును దానికి తన పేరు చెప్పి నీవెవ్వతెవనియు నాబ్రాహ్మణుని యవసరము నీకేమిటికనియు నీవిచ్చటికేల వచ్చితివనియు నడిగిన నజ్ఞతర యిట్లనియె. అయ్యా! నా వృత్తాంతమేమని చెప్పుదును. నేను మాళవదేశాధీశ్వరుండయినా ధర్మపాలుని భార్య సునందయొక్క పరిచారికను. నా పేరు రత్నావతి యందురు. మా రాజుగారిని శత్రువులు కోట ముట్టడించి బందీగృహంబునం బెట్టుటయు మా యేలిక సానియైన సునందను గర్భభరాలసయైయుండ మూడేడుల ప్రాయముగల కుమారు నెత్తుకొని నింబవతియను దాది వెంటరాగా బ్రచ్ఛన్నమార్గంబున గోట దాటించి మేమందరము నొక అరణ్యమార్గంబున బడిపోయితిమి. ఆగమన వేగంబున నింబవతి యొక మార్గంబునను, నేనును సునందయు నొక మార్గంబునం బడిపోయితిమి. ఆ యరణ్యములో గ్రుమ్మరుచుండ నొక నాడుదయంబున సునందకు బ్రసవవేదన యావిర్భవించి చక్కని కుమారునింగనియెను. ఆమెయు నుదకము దీసికొనిరమ్మని నన్ను బంపుటయు నేనతి జవంబునంబోయి యాప్రాంత భాగముల నరసి పర్ణపుటంబున జలంబు బట్టి దీసికొనిపోయితిని. నాకు దారిలో నొక బ్రాహ్మణు డెదురుపడెను. కాని సునందను జూచు తొందరతో బోవుచుంటిని గాన నంత విమర్శించితిని కాను