పుట:కాశీమజిలీకథలు -02.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

224

కాశీమజిలీకథలు - రెండవభాగము

మూట నెత్తిమీద బెట్టుకొని వచ్చుచు నెండతాకున నాయాసమువచ్చి యొక చెట్టుక్రింద గొంచెము సేపు విశ్రమించితిని. అప్పుడా చెట్టుమీద శిశురోదనము వినబడుటయు వెఱగుపడి తలపైకెత్తి చూచితిని. ఆ చెట్టుకొమ్మల సందున నొక కోతి చక్కనిబిడ్డను నొడిలోబెట్టుకొని ముద్దాడుచుండుటయు, శిశువు కేరుకేరుమని యేడ్చుచుండుటయు గనంబడినది. అప్పుడు నేను ఔరా! ఈ వానరము నక్కులోనికి నరశిశువెట్లు వచ్చెనో? యని యాశ్చర్యమందుచు నాకోతి యాబిడ్డను కొమ్మల సందున బెట్టుట దిలకించి తటాలున దుడ్డుగర్రతో నా వనచరణమును బెదరించి మెల్లన నా చెట్టు పైకి నెక్కి పదిలముగా నప్పట్టిని యొడిలో బెట్టుకొని చెట్టుదిగి భారముగానున్న బియ్యము మూటను విప్పి యచ్చటనున్న కోతుల కాహారముగా జిమ్మి యా బిడ్డతో నింటికి వచ్చితిని.

రామ :- ఆ ప్రాంతమందు మీకెవ్వరు గనంబడలేదా!

బ్రహ్మా :- దారిలో నొకయాడుదిమాత్ర మెదురుపడినది. దాని నేమియు బల్కరించలేదు. నాకప్పుడు సంతానములేదు గనుక బిడ్డ దొరకెనను సంతోషముతో వడివడిగా నింటికి వచ్చి నా భార్యకా వృత్తాంతమంతయుం జెప్పి యబ్బాలునిచ్చి వానికి హరిదత్తుడను పేరు పెట్టితిని.

రామ :- అగునగు మంచి పేరే పెట్టితివి. హరి యనగా కోతియు భగవంతుడును గనుక రెండు విధములచేతను జక్కగానే యున్నది. తరువాత-

బ్రహ్మా :-- అద్భుత తేజస్సంపన్నుండగు నాబాలునింజూచి నా భార్యయు మిగుల సంతసించుచు మిక్కిలి గారాబముతో గన్నపుత్రుని వలెనే పెనుచుచుండ బదిరెండేడుల ప్రాయమువచ్చెను. అప్పు డుపనయన సంస్కారము నిర్వర్తించితిని.

రామ :- తరువాత.

బ్రహ్మా :- వానిని బెంచిన మూలముననే గాబోలు పిమ్మట నాకును నొక కుమారుం డుదయించెను.

రామ :- ఔను. ఆలాగున గలుగుట లోకాచారమున్నది.

బ్రహ్మా :- వాడు గలిగినది మొదలు నా భార్య హరిదత్తుని యందీర్ష్యగలిగి యన్నపానాదుల యందు మరియొక రీతి జరుప దొడంగినది.

రామ :- అది స్త్రీజనసామాన్యమే కదా? తరువాత.

బ్రహ్మా :- అక్కపటమేను గ్రహించి యా చిన్నవానిని విద్యాభ్యాసమునకు మా ప్రాంతమున నున్న యొక అగ్రహారములో నొక యాచార్యునొద్ద నుంచితిని. హరిదత్తుడు గుణవంతుడును, రూపవంతుడును, బుద్ధిమంతుడునై యున్న వాడు గావున నతని యొద్దనే గొన్నిశాస్త్రము లభ్యసించి చివరకాయన కూతురు కారణమున నెచ్చటికో పారిపోయెనని తెలిసినది. ఇతడు వాడు కాడుగదా? అని యూహ బుట్టుచున్నది.

రామ :- అయినంగావచ్చును. రేపుపోయి మీరు చూడండి. గురుతుపట్ట గలరా?