పుట:కాశీమజిలీకథలు -02.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హరిదత్తుని కథ

223

బుచ్చిగాడికి వివాహము జేయుదురను తాత్పర్యముతో ముసలిది చెప్పగా బయలుదేరి వచ్చితిని.

అచ్చన్న :- ఈ వచ్చిన వారందరు నట్టి యభిప్రాయము తోడనే వచ్చినారు కాని యింతలో నేదియో గడబిడ పుట్టినదట అదంతయు రహస్యముగా నున్నది. సూర్యోదయమున నంతయు దేటపడును.

బ్రహ్మావ :- అయ్యో ! నేను మిగుల కష్టపడి వచ్చితినయ్యా! దైవము నా యాశ యేమిచేయునో? ఇంతకు నదృష్టదీపమహారాజుగా రిచ్చటనున్న మాట నిజమేనా?

అచ్చన్న : :- ఏమో! యేసంగతి నాకు బాగా తెలియదు. నేనుగూడ యీ మధ్యాహ్నమునకే వచ్చితిని. ఈ రామసిద్ధాంతిగారు నాలుగు దినముల క్రిందట యిచ్చటికి వచ్చినారట ఈయన కంతయు దెలియగలదు.

బ్రహ్మావ :- ఏమండీ సిద్ధాంతిగారు! దాని బ్రూహి మీకేమయినం దెలిసినదేమో చెప్పండి నేను పెద్దవాడను గంపెడాశతో వచ్చితిని.

రామ :- ఇప్పుడు మొదటికే మోసము వచ్చినది. వినుండు. ఆదృష్టదీపుడు కొన్నినాళ్ళ క్రిందట నీయూరు రహస్యముగా వచ్చి ఈ రాజు కూతురు కాంతిమతి యను దానితో రహస్యముగా గ్రీడించెనట. దానికి గర్భమయినది అది గాంధర్వవివాహములో లెక్కించుకొని ఈ రాజుగారు కూతురి నిందింపక సురక్షితముగా గాపాడుచుండ గొన్ని దినముల క్రిందట గుమారుడుదయించెను.

బ్రహ్మావ :- ఆలాగునా? తరువాత తరువాత.

రామ :- అంతకుమున్నే యదృష్టదీపుడు తెలియకుండా పారిపోయెను. కావున నీరాజుగారతని చిత్రఫలకము చారులకిచ్చి నాల్గుదిక్కులకుంబుచ్చి వెదకి దీసికొనిరండని పంపిన వారును పోయి యొకని నదృష్టదీపుడే యని తీసికొనివచ్చిరి.

బ్రహ్మావ :- పిమ్మట ?

రామ :- ఆ వచ్చినవాడు నేనదృష్టదీపుడిని కాననియు నేను హరిదత్తుడను బ్రాహ్మణకుమారుడ ననియు గాంతిమతి నంతకుము న్నెన్నడును చూచియెరుంగననియు నీకుమారుడు నా కుమారుడు కాడనియు జెప్పుచున్నవాడట. రాజపుత్రిక తాను పూర్వము వరియించిన వాడితడే యనియు నితండెట్టి యభిప్రాయముతోనో యిట్లనుచున్నవాడు కావున నీతనింబోనీయరాదని నిశ్చయముగా బలికినదట. ఇప్పుడా మీమాంసలోనున్నది.

బ్రహ్మావ :- ఎద్దియో స్మరించుకొని కన్నీరువిడుచుచు, సిద్ధాంతిగారూ! ఆ హరిదత్తుడు మా హరిదత్తుడు కాడుగదా?

రామ :- అదేమిటయ్యో! మీకొక హరిదత్తుడుండెనా యేమి?

బ్రహ్మావ :- అయ్యో! ఆడనిర్బాగ్యురాలిమూలముగా నతని నెడ బాసితిని. వినుండొకనాడు, నేను జాము ప్రొద్దెక్కు సమయమున నొక అరణ్యమార్గమున ముష్టి