పుట:కాశీమజిలీకథలు -02.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

220

కాశీమజిలీకథలు - రెండవభాగము

మొదటినుండియు నీమాట లనుమానముగానే యున్నవి. సామాన్యుడు నీవు దెచ్చిన రత్నముల ముట్టుట కర్హుడగునా? తెలిసినది రమ్ము. అంతఃపురమునకు బోదము. నిన్ను జూచుటకై మా రాజపుత్రిక తొందరపడుచున్నదని యదృష్టదీపుని జూచి పలుకుచు నతని మెడలో ముత్యాలహారము వైచినది. అప్పుడు అచ్చటనున్న వారందరు జయ జయ అను శబ్దములతో గరతాళముల వైచిరి.

అదృష్టదీపుడట్టి సమయములో నేమియు బలుకక ప్రియంవదను హరిదత్తునికి వివాహముచేసి అతనికోరిక తీర్చెదనని మొదట శపథము చేసియున్నవాడు కావున నంతఃపురమునకు బోవుట కిష్టపడక హరిదత్తుని వెదకుటయందు దలంపుగలిగి యా రహస్యమేమియు వెల్లడించక సంతసం బభినయించుచు రాజవాహనునితో నిట్లనియె. దేవా! ఇప్పుడు ప్రియంవద నన్ను జేసిన గౌరవమున కెంతయు సంతసించితిని. ఆమె యానతి చొప్పున నీ యొప్పులకుప్ప నన్నంతిపురికి రమ్మని నిర్బంధించు చున్నది. కాని నాయాశయ మొక్క టరయవలయును. నేనిప్పుడొక దీక్షలో నుంటిని అది యిక పదిదినములకు ముగియును. అంత దనుక శుద్ధాంతమునకు బోరాదు. ఇప్పటికి సెలవిచ్చితిరేని తిరుగ దీక్షావసానంబున వచ్చువాడనని సహేతుకముగా నుడివిన విని రాజవాహనుడేమియు జెప్పలేక నిక్కముగా దలంచి యావార్త ప్రియవదకుం చెప్పుమని కలహంసిక కానతిచ్చెను.

ఆ పోడయు నా రాజకుమారునితో నెద్దియో ముచ్చటింపదలచి అభిప్రాయము సూచించుటయు అతండది యవసరము కాదని తిరిగి సూచించెను. పిమ్మట నక్కొమ్మయు అతనికి ప్రియంవద యందంత అనురాగములేదని గ్రహించియు వెల్లడిచేసినచో నా చిన్నది చింతించునని తలంచి యించుక శంకించుకొనుచు మెల్లగా గన్యాంతఃపురమునకు బోయెను. అదృష్టదీపుడు తన విడిదకుం బోవుటకు బయనమగుటయు రాజు అతండిచ్చగింపకున్నను బలవంతముగా నుత్తమాశ్వముల బూన్చిన శకటంబుపై నెక్కించి చుట్టును జయ జయ ధ్వనులతో రాజభటులు పరివేష్టింప రాజవైభవముతో బంపెను. ఆ వార్తవిని పౌరులందరు సంతోషముతో నతనిపై పుష్పములు జల్లదొడంగిరి. అతనినందరు హరిదత్తుడను బ్రాహ్మణకుమారుడనుకొనిరి, గాని అదృష్టదీపుడని యొకరును నెఱుంగరు.

అట్టి వైభవముతో నదృష్టదీపుడు బలభద్రుడున్న చోటికిబోయి తనరాకకై వేచియున్న యీ చిన్నివానిని గాంచి గౌగిలించుకొనియెను. భలభద్రుడును నతని వైభవ మంతయుం జూచి సంతసించుచు తత్కారణమడిగి తెలిసికొని మృతుండు జీవించినం బొడమునంత మురిపెమందుచు నతని యదృష్టదేవతను నేతెఱంగున నభినుతించెను. తరువాత నదృష్టదీపుడు అప్పరివారమునంతయు యథాస్థానమునకసిపి బలభద్రునితో నేకాంతముగ గూర్చుండి యిట్లు వితర్కించెను. తమ్ముడా! నేనిప్పుడు మృత్యుముఖంబునుండి వెల్వడితిని. కాని మఱియొక చింత యంకురించినది. పాపము హరి