పుట:కాశీమజిలీకథలు -02.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

214

కాశీమజిలీకథలు - రెండవభాగము

కొని యొడిజూచుకొనునంతలో నందుబూర్వము తాను సంగ్రహించి మూటగట్టిన దోసెడు రత్నములమూట గనంబడినది ఉత్కృష్టకాంతులచే నొప్పుచున్న యా దివ్య మణులంగాంచి తల పంకించుచు నోహో ! ఇది దేవమాయకాని మఱేమియుంగాదు. వీనిఁబట్టి కలగానియట్టు స్పష్టపడుచున్నది.

కలలోగన్న వస్తువు లెప్పుడేని మేల్కొనిన గాన్పించునా! యోషధీమహిమ యొండె దేవతా మాయ యొండె గావలయును ఎట్లయినను మేలే యగుంగాక యని యాలోచింపుచు నెట్టకే నా రాత్రి గడపెను. ఉదయంబున మదంబుబౌదల లేచి యా గిరి దిగి మణిఘృణులచే దనమేనంతయు వింతకాంతిచే మెరయుచుండ నా రత్నము లన్నియుం బదిలముగా మూటగట్టికొని పట్టణములోనికివచ్చి ముందుగా గలహంసిక యింటికరిగెను. అమ్మచ్చకంటియు నా చిన్నవానింజూచి సంతసించుచు నభ్యర్చించి, యార్యా! నేను మీరాక వేచియున్నదాన. మీరిచ్చిన ప్రశ్నమునకు మా రాజపుత్రిక యుత్తరము చెప్పినది తాటిచెట్టునీడంగూర్చుండి మీరాజుగారు నవ్విన కారణము వినుడు. మర్రిచెట్టు విత్తనము మిక్కిలి చిన్నది తాళవృక్షము విత్తనము మిక్కిలి పెద్దది. బీజ మల్పమైనను నీవటవృక్షము మిగులవ్యాపించి నా సేననంతయు నెండదగులకుండ నీడ యిచ్చి కాచుచున్నది. ఈ తాళవృక్షము బీజాధిక్యముకలదియై నను నిరువురు నిల్చుటకు దగిన నీడ నియ్యలేకపోయెనే! సృష్టివైచిత్ర్యమెంత వింతగా నున్నదని మీ రాజుగారు నవ్విరి ఇదియే కారణము అని ప్రియంవద జెప్పినది. ఈ సంగతి వారికిజెప్పి మీ కిచ్చిన కానుకలో నాకుగూడ బంచియిండు. వేగము పొండని పలుకగా సంతసించుచు నతండా రాజపుత్రిక బుద్ధికౌశల్యమునకు మెచ్చుకొనుచు నొక్కింతసేపు ధ్యానించి మరల దాని కిట్లనియె.

కలహంసికా! నా మిత్రు డిప్పు డెచ్చటనో యున్నవాడు. అతని యొద్దకు బోయి వచ్చుసరికి మిగుల నాలస్యమగును. ఈ ప్రశ్నలవిషయమై నీవు మిగుల శ్రమ పడితివి. మీ ప్రియంవదసైతము నీ నిమిత్తమేకదా యుత్తరమిచ్చినది. ఇప్పుడు నిన్ను రిత్త పొమ్మనుట ధర్మముకాదు. నా యొద్ద బ్రస్తుత మీ రత్నములు మాత్రమున్నవి. వీని నీకు బారితోషికముగా నిచ్చుచున్నవాడ. గైకొనుమని పలుకుచు దనయొడిలోనున్న రత్నములుదీసి యక్కలహంసిక దోసిటిలో బోసెను. కన్నులకు మిరుమిట్లు గొలుపు కాంతులతో నొప్పుచున్న యా రత్నములంజూచి యా చిగురుబోడి వెఱగందుచు నతడు మహాప్రభావసంపన్నుడుకాని సామాన్యుడు కాదని నిశ్చయించి యతనికి నమస్కరింపుచు యనుమతి వడసి యప్పుడే యా మణులం దీసికొని ప్రియంవద కడకు బోయినది.

తరువాత నదృష్టదీపుడు తాను రాత్రిజూచిన విశేషములు బరిభద్రునితో జెప్పుటకు మిక్కిలి తొందరపడుచు వడిగా నింటికి బోవుచుండెను. ఇంతలో రాజు కింకరులు కొంద ఱెదురుపడి యాతని విమర్శించిచూచి దొరికితివి. హరిదత్తా! ఎచ్చ