పుట:కాశీమజిలీకథలు -02.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భువనేశ్వరిదేవి కథ

215

టికి బోయెదవని నిర్బంధింపుచు, గారాగారప్రాయమైన యొక సౌధమునకు దీసికొనిపోయిరి. అదృష్టదీపుడు వాండ్రతో నేనేమి యపరాధము జేసితిని. నేనుబెట్టిన మితియు మీరలేదే. అప్పటికి నేను రాకపోయినచో నన్ను నిర్బంధింపవలయునుగాని యప్పుడే యిట్లు ఆటంకబెట్టితిరేల? ఇదియునుంగాక నేను మిత్రగుప్తుడను. హరిదత్తాయని పిలుచుచున్నా రేమి! హరిదత్తుడెచ్చటికేని బారిపోయెనా! యని యడుగగా నాతనికి నాకింకరు లిట్లనిరి.

నీ మాయమాటలను మేము నమ్మము. నీవు తప్పక హరిదత్తుడవే ఇదిగో నీ యాకృతిగల చిత్రఫలకమును జూచికొనుము. నీకును దీనికిని యించుకయు భేదము లేదు. నీవు మమ్ముల మాయజేసి పారిపోయితివి. నీకతంబున మాకు మాటవచ్చినది. ఈసారి నీకు మరణము తప్పదు. నీ విషయమయి రాజుగారికి మిక్కిలి కోపముగా నున్నది. నిన్ను మున్నుజెప్పిన మితివరకు నిలుపునని తోచదు. పారిపోయిననేరము బెద్దదిగదా? ఇక నీయిష్టదైవములను ధ్యానించుకొనుమని పలుకగా విని యతండు వెఱగందుచు నోహో! ఇది మిగుల చిత్రముగానున్నది. నన్ను హరిదత్తుడని వీరు భ్రమ జెందుచున్నా రేమి? అతండు నా పోలికనున్నవాడు కాబోలు. ఔను మొదట బలభద్రుడుగూడ నట్లే చెప్పెను. పోనీ వానికొరకు నేను మునుపే ప్రాణములు విడువదలంచుకొని యున్నానుగదా ఇప్పుడతండు తప్పించుకొని పారిపోయెను కాబోలు. మంచినేర్పరియే? ఎట్లయినను బ్రాహ్మణకుమారుడు బ్రతికినం జాలుగదా యని యూహించుచు గాలమహిమ కచ్చెరు వందుచుండెను.

అచ్చట గలహంసిక యదృష్టదీపుడిచ్చిన రత్నములను దీసికొని ప్రియంవదయొద్దకుబోయి యమ్మణులం జూపుచు నతని చరిత్రయంతయు జెప్పినది. అప్పు డప్పడతి యమానుషంబులగు రత్నంబులంజూచి యాశ్చర్యమందుచు దానితో నిట్లనియె. కలహంసికా! నీవు చెప్పినప్పుడు మొదట నేను నమ్మ లేదు. ఈ మాత్రపు దానికే యింత ధనమిచ్చునా? యని నిరవించితిని. నీవు మిక్కిలి నిర్బంధముజేయగా చెప్పితిగాని యంత శ్రద్ధజేయలేదు. అదృష్టదీపుని ప్రసిద్ధి మనము వినుచున్నారము కదా. అతని మిత్రుని దాతృత్వము సైతము కొనియాడదగియే యున్నది ఈ రత్నములు వెలగట్టించిన గోటికి దక్కువ యుండవు. మాతండ్రి రాజ్యమంతయు నింత లేదని తోచుచున్నది. నాకీవ్రతమున్నదిగాని యట్టివాని గైకొనిన జక్కగా నుండును. అతండు మిక్కిలి చక్కనివాడనియుం చెప్పుచుంటివికదా! నా ప్రశ్నముల కుత్తరము జెప్పువాడీలోకములో లేడు. నా యౌవనమంతయు వృధగా బోవుచన్నదని వేడి నిట్టూర్పులు నిగుడ బల్కుచున్న యాచిలుకల కొలికింజూచి కలహంసిక యిట్లనియె.

అక్కా! పెక్కు దినములనుండి నిన్నీవిశేష మడుగవలయునని తలంపు గలిగియున్నది కాని నీకేమి కోపము వచ్చునో యని సందేహించుచు నూరకొంటిని.