పుట:కాశీమజిలీకథలు -02.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భువనేశ్వరిదేవి కథ

213

    తనరునిధులకు నధికారి తత్ప్రియంవ
    దా ప్రియుండు నతండెవో తథ్యముగను.

అనియున్న పద్యమును ముమ్మారు చదువుకొని ముఖంబున నించుక విన్నదనంబు దోప అయ్యో! ఈ లిపియందు నాకప్రియం బొకటియున్నదే. నేనిప్పుడు పడుచున్న యిడుములన్నియు హరిదత్తుని కొరకేకాని నానిమిత్తముకాదు. ఇందులో ప్రియంవదాప్రియుండు లతదొరకినవాడేయని యున్నది పాప మాహరిదత్తు డాసబడిన పడతిని నేనెట్లు స్వీకరింతును! అయినం గానిమ్ము. అంతవరకు వచ్చినప్పు డాలోచించుకొనవచ్చును ముందుగా నిమ్మహాదేవికి నమస్కరించి తరువాత కృత్యముల నాలోచించుకొనియెదంగాక యని నిశ్చయించుకొని కన్నులమూయుచు బరాకున తన చేతిలో నున్న యోషధిలతను క్రిందనుంచి సాష్టాంగముగా నమస్కరింపుచు మనంబున నిట్లు ధ్యానించెను.

శ్లో. మదాపదపహారిణీం మణిఘృణీలసన్నేఖలాం
    మనోజ్ఞముఖపంచక ప్రకటితాధిక ప్రాభవాం
    కృపాకలితవీక్షణా ముఖిలలోక సంరక్షణీం
    త్రిలోచనకుటుంబినీం భువననాయకింభావయె

అని కొంతసేపు భక్తిపూర్వకముగా ధ్యానించిలేచి కనులు దెరచి చూచువరకు నక్కొండ శిఖరముగాక మఱేమియుం గనంబడలేదు. అప్పు డతం డదరిపడుచు నాకసమువంకజూచి నక్షత్రములు గనంబడినవి. భూమివంకజూడ బచ్చికయు రుప్పలు శిలలు గనంబడినవి. అట్టి సమయంబున నతనిచిత్తమున నెట్లుండునో తలంపుము ముహూర్తకాలమతం డున్మత్తునిక్రియ నేమియుం దోపక విభ్రాంతచిత్తుండై ఆహా! యేమి యీ మాయ యిప్పుడు నాకు గనంబడినదంతయు గల యగునా! మాయ యగునా! నా చేతిలో నున్న యోషధీలత యేమైనది? క్రింద బెట్టితినే? అట్లు పెట్టినట్లు కలలోనే వచ్చెనేమో? నా కేమియుం దెలియకున్నది. అయ్యో! కలకాదు, నిక్కువమే నేనా యోషధిని పరాకున నేలబెట్టి అమ్మవారికి మ్రొక్కితిని కాదా; దానంజేసి యామేడ యదృశ్యమైనది. కానిమ్ము అదియు నిచ్చటనే యుండునని నిశ్చయించి యా ప్రాంతభాగమంతయు వెదకెను గాని యెచ్చటను నతనిచేతి కా యోషధి తగిలినది కాదు.

అప్పుడది యతండు కలగా నెంచి తాను సంతతము భువనేశ్వరీ దేవాలయమును గురించి ధ్యానించుచుండ నదియట్లు కలలో గనబడినది ఆ సంగతులే ప్రియంవద కుత్తరము చెప్పెదను. సమ్మతించిన సమ్మతించుగాక లేకపోయిన మడియించు నింతకన్న నేమి చేయును. కానున్నది కాకమానదుకదాయని నిశ్చయించి యా రాత్రి తాను జూచిన సంగతులన్నియు స్మరించుకొని వెఱగందుచు నెద్దియో తలంచు