పుట:కాశీమజిలీకథలు -02.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

212

కాశీమజిలీకథలు - రెండవభాగము

నిగనిగలకు వెరచుచుఁ గన్నులు మూసికొనుచు నాతలుపులు తటాలునమూసెను. మరియు రెండవగదితలుపు తెరచినంత నందు వైడూర్యరత్నములరాసు లసంఖ్యాకములుగా నున్నవి. అతడు దోసెడు రత్నములు దీసి కొంగున మూటఁగట్టెను. ఈరీతి నందున్న గదులన్నియుం బరీక్షింపఁ బ్రతియరయందును వేరువేర నవరత్నముల జాతులు బంగారునాణెములు నవనిధులు బంచలోహములు గలిగియున్నవి. వానిం జూచినంత నతఁడు స్వాంతమున నింతింతనరాని సంతోషము జెందుచు నోహో! ఈ సొమ్మంతయు నాయధీనమైనచో లోకంబున యాచకులను పేరులేకుండగఁ జేయకపోదునా? యని తలంచుచు మఱియుం గొంతసేపందున్న విశేషము లన్నియుం జూచుచుండెను.

ఆ లోపలఁ దిరుగుచుండ నొకమూల సోపానములు గనంబడినవి. వాని ననుసరించి పైకినడువనడువ మరియొకయంతస్థు కనంబడినది. అందు మొదట నద్భుతమయిన తేజఃపుంజముగాక మరి యేమియుం గనఁబడలేదు. దానికి వెరిచి యతండు కొంతసేపు కన్నులు మూసికొని నిదానించి చూడంజూడ నాకాంతి యంతయు సూర్యకిరణములచే మంచు విరియునట్లు క్రమంబున నణగిపోయినది. పిమ్మట నలుమూలలు దృష్టిప్రచారము బరగించినంత నాగోడలన్నియు రత్నమయములైయున్నవి. మరియు నచ్చట రత్నకంబళి యాస్తరణగాఁ బరువఁబడియున్నది. ఆ యంతరములోనున్న విశేషములన్నియుం జూచుచుఁ బోవఁబోవ దూరపుముఖముగా నొప్పుచున్న యొకబంగారు విగ్రహము బొడఁగట్టినది. పరిశీలించి చూడఁగ నదియొకశక్తివలెఁ దోచినది. ఆ విగ్రహమునకు రెండుచేతులు, మూడుతలలు గలిగియున్నవి. దానిం జూచువారికి వెఱపుగలుగక మానదు.

అతండు మనంబునంబుట్టిన సాధ్వపము నడంచుకొనుచు నా విగ్రహమును తర్కించి చూడఁగా వెనుకను మరల మెట్లుకనంబడినవి ఆ సోపానమార్గమున మరలఁ బైకెక్కఁగా వేరొకయంతరమున దర్శనీయమయిన యలంకారముతోఁ జూడనయ్యె. అందొక మహాశక్తి యైదుముఖములును, పదిచేతులునుఁ గలిగి జగములన్నియుఁ బాలించు సామర్థ్యమును సూచించు తేజంబున నొప్పుచు దయాదృష్టి ప్రసాదములు వెదజల్లుచున్నట్లు గనఁబడినది మరియు నమ్మహాదేవి ముఖముల యందును పంచవర్ణములు గలిగియున్నవి ఆమె పీఠమున భువనేశ్వరీదేవియని వ్రాయఁబడి యున్నది. అమ్మహాదేవి భువనేశ్వరీదేవియని తెలిసినప్పు డతని మనంబునం బొడమిన యానంద మేమని యందును. అప్పుడతని మనంబునం బెక్కు తలంపులు పుట్టినవి. మరియు విమర్శింప నద్దేవి వెనుకటి గోడయందిట్లు వ్రాయబడియున్నది.

గీ. ఇలనదృశౌషధీలత యెవనిచేత
    జిక్కు వాడె యిందు రక్షింపబడుచు