పుట:కాశీమజిలీకథలు -02.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భువనేశ్వరిదేవి కథ

211

నేమియుం గనంబడినదికాదు. తరువాత ననుమానముదీరక తలనానినచోటు చేతితో దడుమగా నచ్చటొక పచ్చనిచెట్టు కనంబడినది దానిపూవులు రత్నములవలె మెరయుచున్నవి. ఆకులును మరకత మాణిక్యముల పోలికరంగు లీనుచున్నవి. అదియు జిన్నమొక్క గనుక యతని క్రిందబడి నలిగిపోయినది. అది మొదట జూచినప్పుడు గనంబడక తడవినతోడనే చేతికి దగిలి కన్పట్టుట కతండు వితర్కించుచు నదితన తలక్రిందబడి నలుగుట సైతము పరిశీలింపుచు రేయి విడిచినంత నదిమరల నదృశ్యమైనది. అతండచ్చట తిరుగ జేయిపెట్టి తడుముటయు క్రమ్మొక్క గ్రక్కున గరమునకు దగిలి గోచరమైనది. అప్పుడతండది యొకయోషధివిశేషమని నిశ్చయించి యిందాకటి చర్యలన్నియు దీనివేమోయని యాలోచింపుచు నియ్యోషది నంటుచుం గూర్చుండి చూచునంత నన్ని శాంత మంతర్ధానముగాక యట్లేయున్నది. అత్తరి నతని చిత్తమున బొడమిన సంతోషమేమని చెప్పుదును. అపరిమితానందము జెందుచు నోహో! తెలిసినది. ఇదియొక యోషధి. దీనినంటినప్పుడు తత్ప్రాసాదము గనంబడును. లేనిచో నదృశ్యమగుచున్నది. నేను బరుండినప్పు డీలత నా తలకు దగులుచున్నది. కావున నామేడ గనంబడునది. లేచినప్పు డదృశ్యమైనది. ఈ సంగతి దెలిసికొనలేక పెక్కుపోకలం బోయితిని. నేనుకాదు. మరియెట్టి బుద్ధిమంతుడైనను నిటు జరిగినప్పుడు విభ్రాంతి నొందకమానడు. చీమకుట్టుటచేత నీ సంగతి తెలిసినది. కాని లేనిచో బెద్దతడ విట్లే భ్రమించు చుండును. అదియుంగాక తల క్రింద నోషధీలతయున్నదని యెట్లూహింతును. నాకీభ్రాంతి బోగొట్టినది పిపీలికము. దానిరుణము నేను దీర్చుకొనజాలనని యూహించుచు నాలతావిశేషమును విడువక తన మొలలోనున్న కత్తిందీసి దాని మొద లంటంగోసి చేతితోఁ బట్టుకొని మెల్లఁగా లేచెను.

అప్పుడతని కుడికన్నును భుజమును తొడయు నదరఁ దొడఁగినవి. ఆ శుభశూచకములఁ గనిపెట్టి యతండు సంతసించుచుఁ దనకుఁ గనంబడుచున్న మేడయొద్దకుఁ బోయెను. రత్నకాంతులచేఁ జీఁకటి యించుకయు లేనందున నందలివిశేషము లన్నియుఁ దేటయగుచున్నవి. దానితలుపులు దెరచియే యున్నవి. ఆ ద్వారమున కిరు ప్రక్కలను రత్నముతోఁ జెక్కిన ద్వారపాలకావిగ్రహములున్నవి. ఆ ప్రతిమలం జూచిన నెట్టివానికి మోహము జనింపకమానదు. మొదట నతఁడా విగ్రహములను జూచి నిజముగా స్త్రీలనుకొని యెద్దియో యడుగఁ బోయెను. నిదానించి చూడంజూడ బొమ్మలని తెలిసినది. తరువాత నతండా గుమ్మమున లోనికిఁబోయెను. మణిస్తంభములచే ప్రకాశించుచున్న యమ్మందిరాభ్యంతరమునఁ బ్రవేశించినంత నతనికి దిగ్బ్రమయైనది. అందుఁ బెక్కు గదులు రత్నకవాటములచే మూయఁబడి యున్నవి. వానివింతలన్నియుం జూచుచు సాహసముతో నొక గది తలుపు తెరచి చూచెను.

విశాలమగు నాగదిలో నుసిరికాయలుకన్న పెద్దవగు వజ్రముల రాసులు వేనవేలు గన్నులకు మిరుమిట్లు కొలుపు కాంతులతో నొప్పుచున్నవి. ఆ వజ్రనికరముల