పుట:కాశీమజిలీకథలు -02.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

210

కాశీమజిలీకథలు - రెండవభాగము

నాశ్చర్యమందుచు నౌరా! ఇది మిగుల వింతగా నున్నది. నిద్రలో స్వప్నము వచ్చుట సహజము. జాగ్రదవస్థలో స్వప్నము వచ్చుట యెచ్చటను వినియుండలేదు. ఇది చిత్ర విభ్రమమేమో తెలియదు. కానిమ్ము యెద్దియైన నీవింత జూచెదంగాక యని మరల లేచినంత నది కనంబడినదికాదు.

అత్తరి నతం డది మరల స్వప్నమని భ్రమపడి విరక్తితో తిరుగాబరుండెను. పరుండి కన్నులు తెరచిచూడ మునుపటి మేడ గనంబడినది దానంజేసి యతనిహృదయమున సంతోష సాధ్వససంభ్రమములు జనించినవి. ఒక్కింత నిదానించి చూచుచు నతండిచ్చట నెద్దియో గారడియున్నది. ఈచిత్రము పరుండి చూచిన గనంబడుచున్నది. లేచిచూడ గన్పట్టదు. మొదట స్వప్నమని భ్రమపడితిని. కాని యిప్పుడది కానట్లు స్పష్టమైనది. ఇది యెద్దిఏని పిశాచమహాత్మ్యమా? యని యూహింతమన్నను నిట్టి చిత్రములు కలుగునని యెప్పుడును వినియుండలేదు. దీనికెద్దియేని కారణ ముండవచ్చును. పరుండియే యూహించెదనని నిశ్చయించి యట్టె చూచుచుండెను.

అతం డట్లెంతసేపు పరుండిచూచినను ఆ చిత్రసౌధము దృష్టి గోచరమగుచునేయున్నది. ఇక యది యంతర్ధానముకాదు. స్థిరపడినది ! దీనిలోనికిబోయి చూచి వచ్చెదనని తలంచుచు లేచినంత నన్నిశాంత మంతర్థానమైనది అతడు మిక్కిలి వెఱగందుచు నోహో! ఇప్పుడు నాకు దెలిసినది. ఇది నిజముగా స్వప్నమే పరుండిన తోడనే కొంచెము నిద్రపట్టును. దానిలో నిట్టి కలవచ్చుచున్నది. కానిచో బరుండినప్పుడు గనబడుచున్నవింత లేచినప్పుడేల కాన్పించదు. ఇదియే నిక్కువమని తలంచి తిరుగ బరుండెను. అత్తరి గ్రమ్మరనమ్మందిరముముందు సుందరముగా బొడచూపిన నతడు మెండుగా వితర్కించుచు మేనెల్ల గిల్లుకొని యదికలగాని యట్లు నిశ్చయించుకొని దాని గురించి పలుదెరంగుల నాలోచించుచు నేకారణమును నిశ్చయింపలేక చివరకు దనకు బిచ్చియెత్తినట్లు నిర్ధారణ చేసికొనియెను.

అంతలో మరల నాలోచించుకొని అయ్యో! నాచిత్తము స్వస్థతగానే యున్నదే నా చర్యలన్నియు దలంచుకొనియున్న నిదానముగా స్ఫురించుచున్నవి. నామనస్పూర్తి పూర్వమువలెనే యున్నది. ఇది యెద్దియునుగాదు. దైవకల్పితము. భువనేశ్వరీదేవియాలయమునకై నేను శ్రమపడుచుండ భక్తవత్సలుడగు పరమేశ్వరు డాయాలయమునుదెచ్చి యిచ్చట బెట్టెను. ఇది నిక్కు.వము కావచ్చును. అట్లయినను స్థిరముగా నుండవలయునుకాని దృశ్యాదృశ్యముగా గనంబడుచుండనేల? మేలుమేలు. ఇట్టియద్భుతము గనంబడునని యెన్నడును దలంచ నైతిని. ఈ చిత్ర మెవ్వరికేని నేను జెప్పిన నమ్ముదురా? భళీ! భళీ! అయ్యారే! యని యాశ్చర్యపారావారనిమగ్నచిత్తుండై విస్తృతనిమేషములగు చక్షస్సులచే నాప్రాసాదమును జూడదొడంగెను.

అతండు విరక్తిచే వట్టినేలనే పరుండి యున్నవాడు కావున నట్టిసమయములో నతనితలలో జీమ కుట్టుటయు నదరిపడి యించుక లేచి తలద్రిప్పి చూచినంత నచ్చట