పుట:కాశీమజిలీకథలు -02.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భువనేశ్వరిదేవి కథ

209

నుండును. ఇది మొదలింక నేను భుజింపను. ఈ రాత్రిగూడ యిచ్చటనే యుండెదను. ఇక నాకు బట్టణములోనికి బోవలసిన యగత్యమేమున్నది? రాత్రివేళ నిందేమైనవిశేషములు కనంబడునేమో చూచెదగాక యని యనేక ప్రకారముల దలపోయుచు నారాత్రి యింటికిబోక యచ్చటనే యుండి యప్పర్వతశిఖరమంతయు మరల బరికించెను. కాని క్రొత్త విశేషము లేమియు గనంబడలేదు.

తరువాత విరక్తి బూని యుదయంబున లేచి మరియొక దేశము పోవలయునని నిశ్చయించుకొని యొక సమభూమిం బరుండి దానిం గురించియే ధ్యానించుచు గాంతిమతిం దలంచుకొనుచు దన పూర్వప్రఖ్యాతి యంతయు స్మరించుకొనుచు దన యప్పటిస్థితిగురించి చింతించుచు ముందు కర్తవ్య మెద్దియని తర్కించుచు నా హృదయంబునం బెక్కుకల్పనలు జనియింప నతం డాలోచింపుచుండ నంతలో నిద్ర పట్టినది. ఆ నిద్రలో నెద్దియో యద్భుతమైన స్వప్నము వచ్చినందున దటాలున మేల్కొని వెల్లకితల బండుకొని కన్నులు దెరచి చూడగా నెదుర దివ్యభవనమొకటి కనబడినది. అదియు నవరత్నదీపములచేత వెలుంగుచు గన్నులకు మిరుమిట్లు గొల్పుటయు నతండు కన్నులు మూసికొని యొక్కింతసేపుండి మరల విప్పి చూచెను. మరల నారీతినే కనంబడినది. దానికి వెఱగందుచు నోహో నాకు స్వప్నములో స్వప్నము వచ్చుచున్నదే! నే నింకను నిద్రబోవుచున్నానా యేమి యెదుటి గనంబడుచున్న సౌధమెవ్వరిది? నే నిప్పు డెచ్చట నున్నాడను. పట్టణములో నుంటినా? కాదు కేళీశైలమున రాత్రి బరుండితిని. అట్లయిన నీమేడ యెక్కడిది? నిజముగా నేను గేళీశైలమున బరుండలేదు. ఆలాగున స్వప్నము వచ్చినది కాబోలు అయ్యో! భ్రమజెందుచున్నానేమి? నేను రాత్రి యింటికిబోక పర్వతశిఖరమున బరుండినమాట నిక్కువమే? నాకాకలి యగుచున్నది. ఇప్పుడు కనంబడు మేడ కలలోనిదే. అన్నా! దీనిమాత్రము కలయని యెట్లు నమ్ముదును. నాకు మెలకువయున్నట్లు నా కన్నులే చెప్పుచున్నవే! ఈ కన్నులు దెరచితి ననుకొనుటయు స్వప్నభ్రాంతియే కాదు గదా! ఇదిగో! యిప్పుడు లేచుచున్నానని పెక్కుతెఱంగుల నంతరంగమున దలపోయుచు దటాలున లేచి కూర్చుండెను. అప్పుడంతకుమున్ను గనంబడుచున్న మేడ గనఁబడక యధాప్రకారము శిఖరి దారుణియే కనబడినది. తరువాత నతం డది కలయని నిశ్చయించి యాసౌధశోభావిశేషమున కచ్చెరువందుచు నయ్యోరే! నాకెంత స్వప్నము వచ్చినది. నిజముగా నట్టి మేడ లుండునేమో, యింక కొంచము సేపు లేవక యట్లేయుండిన నిద్రమెలకువ రాక పోవునుగదా యెంత తొందరపడితిని అని పెక్కుతెరగుల దలంచుచు కొంత సేపచ్చటనే కూర్చుండి ధ్యానించుచు మరల శయనించెను. అట్లు పండుకొన మరల జూచువరకు మొదట గనంబడిన సౌధము వెండియు బొడగట్టినది. అత డప్పుడు మరియు