పుట:కాశీమజిలీకథలు -02.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

208

కాశీమజిలీకథలు - రెండవభాగము

దయమున లేచి మరల నద్ధరణీధరము కడకు బోయి మధ్యాహ్నమువరకు నచ్చటి విశేషములు చూచుచు నింటికి వచ్చి భుజించిన తరువాత వెండియు నక్కొండదండకు బోయి యచ్చటనే క్రుమ్మరుచుండెను. కాని యే విశేషము కనంబడినది కాదు. అప్పు డతండు కలహంసిక చెప్పిన పర్వతమిది కాదేమోయని యనుమానింపుచు నచ్చటి గురుతులన్నియుం జూచుకొని రాత్రికింటికి వచ్చి భుజించిన వెనుక కలహంసిక యింటికిబోయెను.

అదియు నతనింజూచి సంతసించుచు సత్కరించి ఆర్యా! మీ రాకకు నేను వేచియున్న దానను. మీరడిగిన ప్రశ్నము మా రాజపుత్రికతో జెప్పితిని. అదియు నవ్వుచు నీపాటిమాట కింతదూరము రావలయునా? యని పరిహాసము చేసినది. నేనును సంతసించుచు నించుబోణి! వడిగా జెప్పుము. నేను బోయి యాతని కెఱింగింతునని తొందరపెట్టగా నక్కలికి అట్లయిన నతండీ ప్రశ్నల కుత్తరము జెప్పినందులకు నీ కేమిచ్చునో తెలిసికొని రమ్ము. తరువాత జెప్పెదనని పలికినది. నేనును సమ్మతించితిని. మరియు నత్తరుణి మీరు అదృష్టదీపునకు మిత్రులని చెప్పినంత నెద్దియో ధ్యానించి తలపంకించుచు నాతో మరేమియు జెప్పినది కాదు. తరువాత నేను వచ్చితిని దీనికి మీరేమిచ్చెదరో చెప్పుడని పలుకుటయు. నతడు సుందరీ! నీకు సందేహమేల నాకు దొరకిన దానిలో సగమిత్తునని మొదటనే చెప్పితిని గాదా? నా కతండా సొమ్మిచ్చిన వెంటనే నీకు దెచ్చి యిచ్బెదను. వడిగాబోయి తెలిసికొని రమ్మని పలుకుచు మరియు నిట్లనియె. తరుణీ! నిన్నను నేను విహారార్ధమై యీ పట్టణమున కుత్తరము దెసకు బోయితిని అచ్చట రెండు మర్రి వృక్షములు పొడవుగా నెదిగి యున్నవి. వానికవతలగా నొకచిన్న మెట్టయున్నది. అదియే యగునా నీవు చెప్పిన ప్రియంవద యొక్క కేళీశైలమని పలికిన నక్కలికియు నౌ నదియే మీరచ్చటికేటికి బోయితిరి? నేనట్టు జెప్పిన సంగతి యెవ్వరితోనైనను జెప్పెదరుసుడీ! అన అయ్యో! అట్లు చెప్పుటకు నేనంత మూర్ఖుడ ననుకొంటివా యేమి. ప్రసంగవశమున నడిగితిని గాని నాకు మాత్ర మీ గొడవ కావలయునా? యని నుడువుచు మరల రేపు వచ్చెదనని జెప్పి యింటికి బోయెను. మరునా డుదయమున లేచి మరల నగ్గిరిదరికరిగి యందు నానావిధములగు రుప్పలు సందులు గొందులు మొదలగునవి మిక్కిలి శ్రద్ధతో చూచెను. కాని యెచ్చటను నేజాడయు గనబడినది కాదు. మరల మధ్యాహ్నమింటికి వచ్చి భోజనము జేసి వెండియు నా కొండదాపునకు బోయి రాత్రివరకు వెదకెను.

అప్పుడతండు మిక్కిలి పరితపించుచు అయ్యయ్యో! నేను రాజవాహనునితో బలికిన మితి సమీపించుచున్నది. ఇప్పటికేమియుం దెలియలేదు. వృధగా బ్రాహ్మణ కుమారుని నురిదీయుదురు. నా చావునకింతయేని విచారము లేదు. వాని రక్షించెదనని వచ్చి చివరకు నాకు శక్యమైనది కాదని చెప్పుటకంటె హైన్యమున్నదా? నేనెప్పుడో వారివలన జంపబడనేల! అంతకు పూర్వమే మృతినొందిన యుక్తముగా