పుట:కాశీమజిలీకథలు -02.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భువనేశ్వరిదేవి కథ

207

పట్టుపట్టుకొని యున్నది. పాపము కొన్నిదినముల క్రిందట నొక బ్రాహ్మణకుమారుడా ప్రశ్నముల కుత్తరము నేను జెప్పెదనని వ్రాసి లోనికిబోయి చివరకు జెప్పలేక పోయెను.

వాని నురిదీయుటకు రాజు సెలవియ్యగా వాని బంధువుఁడెవ్వడో మరల నారుమాసములు మితికోరినాడట. అందుమూలమున వానినింకను నురిదీయలేదు. వాని కుత్తరము జెప్పుట బ్రహ్మతరముగాదు. తండ్రి యెన్నియో విధముల బోధించెను. కాని వినినదికాదు. ఆ చిన్నది ప్రతిశుక్రవారము మధ్యాహ్నము యింటియొద్ద భువనేశ్వరీదేవి నర్చించి సాయంకాలమున దప్పక కేళీశైలమునకు బోవును. ఆ శైలము మీ పట్టణమున కుత్తరదిక్కున గ్రోశదూరములో నున్నది. అంతవరకు మేమందరము కూడా పోవుదము కాని యగిరిశిఖర మెక్కునప్పుడు మాత్రము మమ్మెవ్వరిని రానీయక తానొక్కరితయే పోయి కొంతసే పందుండి మరల వచ్చును. ఆ శిఖరముమీద నేమియును లేదు. అచ్చట నేమిచేయునో మా కెవ్వరికిని దెలియదు.

ఒకనాడు సాహసించి యా యించుబోడి యందేమి చేయుచున్నదో చూతమని ద్వారరక్షకుల గన్మొరగి యా శిఖరము మీదికి బోయితిని కాని నాకెక్కడను నక్కలికి గనంబడినది కాదు. ఏ శిలచాటుననో దాగియుండునని యూహించి చూచిన శిక్షించు నను వెరపుతో సత్వరము మరలి గిరిదిగితిని. అమ్ముదితచేయు కృత్య మిదియే యని చెప్పిన ముదితహృదయుండై యత డొక్కంతసే పూహించి మరల నత్తరుణితో నాతీ! ఆ తెరవ శుక్రవారమునాడు గాక మరి యెప్పుడని యక్కొండదండకు బోవునా? యని యడుగుటయు నమ్మదవతి యతనితో నాడుగాక మరి యెప్పుడు నగ్గిరిదరి కఱుగదని చెప్పినది అతం డయ్యితివ నుడివిన మాటలన్నియును విని సంతసించుచు బొలతీ నేనీనాటికి బోయివచ్చెద. ఱేపైనను శ్రద్ద జేసి యడుగుమీ? యని పలుకుచు నక్కలికిజేత ననిపించుకొని మరల నింటికి వచ్చి నాటి సాయంకాలమున గలహంసిక చెప్పిన గురుతులు చూచుకొనుచు నా విహారశైలముకడకు బోయెను.

ఆ శైలము చుట్టుకొలత రెండు క్రోశములుండును. ఎత్తు పాదక్రోశముగలదిగా నున్నది. అదియు గమోన్నత మగుటచే నెక్కుటకు గష్టములేదు. మార్గములు పెక్కు గలవు. దానియందు చిన్నతుప్పలే కాని పెద్దవృక్షము లేమియును లేవు. పర్వతమును జూచి సంతోషించుచు నా యదృష్టదీపుడు రెండు మూడుసారులు అక్కొండ చుట్టును తిరిగివచ్చి యొక దెసనుండి యమ్మెట్టపై కెక్కెను. ఆ శిఖరము విశాలముగాను సమచతురస్రముగా నున్నది. అచ్చటనైనను చిన్నదుప్పలే కాని మరి యేమియును లేవు. అట్టిచోట నతండు మిగుల శ్రద్దాపూర్వకముగా నలుమూలలు దిరుగుచుండెను. కాని యెంతసేపు తిరిగినను యేమియు గనంబడినది కాదు.

అంతలో సాయంకాలమగుటయు నగ్గిరిదిగి మరల నింటికివచ్చి యచ్చట బలభద్రునితో ముచ్చటించుకొనుచు నారాత్రి సుఖముగా వెళ్ళించెను. మరునాడరుణో