పుట:కాశీమజిలీకథలు -02.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

206

కాశీమజిలీకథలు - రెండవభాగము

యోగముచేసి దీనిని జెప్పితివేని నాకుదొరకు లాభములో నీకు సగము పంచియిచ్చెద నని చెప్పగా విని యా కలహంసిక చిరునగవు నవ్వుచు నిట్లనియె

ఆర్యా! మీరు నన్నింత బెద్దజేసి గౌరవింపుచుండ నేనేమని యందును. జగద్విదితకీర్తియగు నదృష్టదీప మహారాజు మిత్రులైన మీకంటె నేను బుద్ధిశాలి నగుదునా? మీరు నన్నుజేసిన గౌరవమునకు మిక్కిలి సిగ్గుగానున్నది. నన్నిచ్చటివారు పొగడుటకు నాయందే విశేషమును లేదు. నాకేవిద్య యందును బాండిత్యములేదు. మీవంటివారు మన్నించుచుండుటయే నా గౌరవమునకు గారణమైనది. నేనంతదానను కాకపోయినను నా యాశ్రమస్థాపన మట్టిదని చెప్పవచ్చును. మా ప్రియంవద రూపమునను విద్యాబుద్ధులచేత ననన్యసామాన్యమైయున్నది. మీరడిగిన ప్రశ్నమునకు నా కేమియు నుత్తరము దోచలేదు. రెండుమూడు దినములు గడచిన తరువాత మీరు మరల నొకసారి దయసేయుదురేని యావిశేషములు భర్తృదారిక వలన దెలిసికొని మీతో జెప్పెద. అప్పడతి యీ ప్రశ్నములకు సులభముగా నుత్తరము జెప్పునని పలుకగా సంతసించును నదృష్టదీపు డప్పుడు దాని యనుమతి వడసి యింటికిబోయెను.

అదృష్టదీపుడు మఱి రెండుదినములు గడచిన తరువాత తిరుగా నాకలహంసిక యింటికి బోయెను. అదియు నాతని నుచితమర్యాదల నర్చించినంత గూర్చుండి దానితో యువతీ! నీ వయస్య నా ప్రశ్నమునకు కత్తరము జెప్పినదా యని యడుగు గుటయు నయ్యతివ యతనితో నిట్లనియె.

ఆర్యా! నేను మఱచిపోయి మిమ్ముల నీదినమ్మున రమ్మంటిని ఆ ప్రియంవదతో నిన్నను మాట్లాడుటకు నవసరము దొరికినదికాదు. ఆ చిన్నది ప్రతి శుక్రవారమును భువనేశ్వరీదేవి నర్చించుచు సాయంకాలమున గేళీశైలమునకు బోవుచుండును. ఆ దివసమున నామెతో నితరగోష్ఠి జేయరాదు. నిన్న నట్టివారమగుటచే మీ మాటనడుగుట తటస్థించినది కాదు. మిమ్ము వృథా శ్రమపెట్టినందులకు లజ్జించుచున్నదాన నని పలుకగా నతడు నవ్వుచు మరల నిట్లనియె. ఇంతీ! యింతమాత్రమునకే నాకుశ్రమ గలుగునా? దీని దెలిసికొనుటకై కాదా దేశమంతయు దిరుగుచుంటిని. రేపు మరల వత్తునులే యని పలుకుచు వెండియు నిట్లనియె.

మచ్చెకంటీ! నీ నెచ్చెలికి వివాహమైనదా1 పిల్లలెందరు? వాల్లభ్యము మంచిదగునా?ప్రతిశుక్రవారమును భువనేశ్వరీదేవి పూజ యెచ్చటజేయును! కేళీశైలమనునది యెచ్చటనున్నది? నిన్నుబట్టి యారాచపట్టియు మాకు బంధువురాలే యైనది. ఆ పూవుబోడి వృత్తాంతము కొంత వినవలయునని యుత్సాహముగా నున్నది. గోప్యముగాకున్న నుడివెదవే యనుటయు నదియు బ్రసంగవశంబున నడుగుచున్నాడని యూహించి యా రహస్య మితరుల కెవ్వరికిని దెలియనిదైనను వానికి మెల్లన నిట్లనియె. ఆర్యా! మా భర్తృదారికకు వివాహ మింతవరకును గాలేదు. ఆ లేమ యేమికారణముననో తానిచ్చిన ప్రశ్నముల కుత్తరము చెప్పువానిం కాని బెండ్లియాడనని