పుట:కాశీమజిలీకథలు -02.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భువనేశ్వరిదేవి కథ

205

కాశీమజిలీ కథలు

18వ మజిలీ

భువనేశ్వరిదేవి కథ

పదినెనిమిదవ మజిలీ మొదలు శౌనకుడు మణిసిద్ధుని దరువాయికథ జెప్పుడని వేపుచుండ నయ్యోగీంద్రుండు నద్దివసంబున దనయనుష్టానమంతయు సంక్షేపముగా గావించి వంటజేసి భుజించిన వెనుక నొకమనోహరతరుశీతలచ్చాయం గూర్చుండి తరువాయికథ నిట్లని చెప్పదొడంగెను. వత్సా! వినుము. అదృష్టదీపుండా పుష్పగిరిలోనుండి నిత్యము రాజపుత్రిక చేయుచున్న కృత్యముల పరీక్షించుచు దూతికల నరయుచు దాదుల వెదకుచు నంతఃపురచారిణులతో మైత్రిచేయుచు నీరీతి గొన్నిదినములు గడపినంత నొకనాడు కలహంసికయను దానికి రాజపుత్రికతో మిక్కిలి మైత్రిగలదని విని దాని యింటి యొద్దకుంబోయి యల్లన నిట్లనియె.

కలహంసికా! నీవు మిగల బుద్ధిశాలివని నీయొద్ద గొన్నివిశేషములు దెలిసికొను తాత్పర్యముతో వచ్చితిని. మాది కాశీదేశము. అదృష్టదీపుడను రాజునకు మిత్రుడను. నా పేరు మిత్రగుప్తుడందురు. అతడు తీర్థయాత్రకు బోయిన నతనిజూచు తలంపునబోవుచున్నవాడ. ఈ యూరువచ్చి పదిదినములైనది. ఈ పట్టణంబున బుద్ధిమంతులలో నగ్రగణ్యు లెవ్వరని విమర్శింప నిన్ను మున్నుగా వక్కాణించిరి. దానం జేసి నీ యొద్దకు వచ్చితిని. బుద్ధికిసాధ్యముకాని పని లేదుకదా. నేనును నా మిత్రుడు నొకనాడు విహారార్థమై చతురంగబలములతో నొకయరణ్యమునకు బోయితిమి. అచ్చట గొంతసేపు విహరించినంత మిట్టమధ్యాహ్నమగుటయు నది గ్రీష్మకాలమగుటచే నెండకునోడి నేనును నా మిత్రుడును ఆ ప్రాంతమందున్న యొక త్రాటిమాను నీడను నిలిచితిమి. మా సేనలన్నియు నచ్చటి కనతిదూరములో నున్న యొక మర్రిచెట్టుక్రింద నిలిచినవి. అట్టి సమయములో నా మిత్రుడు పక్కున నవ్వెను. అకారణముగా నట్లు నవ్వితివేమని నేనెంత ప్రీతితో నడిగినను చెప్పడు. యీ కారణము నీ వూహించి చెప్పితివేని నీకు నూరువేల దీనారము లిత్తునని ప్రతిజ్ఞచేసెను. నేను నట్టి ప్రశ్నమున కుత్తరముచెప్పుటకు నారుమాసములు మితికోరితిని. అతండిచ్చెను. నేనది మొదలు చేశాటనము చేయుచు బ్రతిపట్టణమునకు బోవుచు నందు బుద్ధిమంతులని పేరు పొందినవారినెల్ల నడుగుచు దిరుగుచుంటిని. ఇప్పటికి మూడుమాసములైనది ఎవ్వరును చెప్పలేకపోయిరి. ఇచ్చట నీవార్త విని నీ యొద్దకు వచ్చితిని. నీ బుద్ధియంతయు విని