పుట:కాశీమజిలీకథలు -02.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

కాశీమజిలీకథలు - రెండవభాగము

ములు వినుచుండ నా చెవులు చిల్లులు పడుచున్నయవి. ఏమి చేయుదును? జీవచ్ఛవములాగున నూరకుంటిని. మనమప్పటివారిమేయైన కాలభేదమును బట్టి యిప్పుడు మరియొకరమైతిమి. కావున బురుషు డేకార్యము చేయుటకును కర్తగాడు. నాకిప్పుడు కర్మానుగుణ్యమైనబుద్ధి పుట్టినది. ఏమికానున్నదో యట్లు జరుగక మానదుకదా. దీనికై విచారింపనేల? పారిపోవుట పురుషకారము కాదు. అట్టి పనికి నేనెన్నడు నొప్పుకొనను. ఈ యారుమాసములలో నావార్త దెలిసికొనుటకై ప్రయత్నింతము దైవానుగ్రహము మనయందు గలిగియుండినచో నెట్లు తెలియకపోవును. నీవు ధైర్యముగా నుండుము.

శ్లో॥ యోమేగర్భ గతస్యాపి వృత్తింకల్పి తవాన్విభుః
      ఒషవృత్తిం విధానాయ సుప్తఃకింను మృతోధవా.

పుట్టించిన భగవంతుడు తరువాయివృత్తి గలిగించుటకు నిద్రబోవుచున్నాడా? లేక మృతినొందెనా? యని చెప్పినట్లు మనకిదివరకంత ఖ్యాతి గలుగజేసిన విధి యిప్పుడు మాత్రమూరకుండునా? మన కెన్నడును నవమానము రాదని నమ్ముము. ఈ యాపద సైత మెట్లో దాటెదమని పలుకుచు బలభద్రునికి ధైర్యము గలుగజేసెను.

అతని మాటలచేత బలభద్రుడు విచారమును విడిచి యెడదను బూని, మిత్రమా! నీవు జనియించిన సమయము మంచిది. నీవు చెప్పిన ప్రకారము నీకెన్నడు నవమానము రానిమాట నిశ్చయిమే. ఈ యారుమాసములలోను దేశాటనము చేయుదము. నీతో నేనును వత్తునని పలుకగా నతండు మరల నిట్లనియె. తమ్ముడా! మనము దేశము తిరుగవలసిన యవసరము లేదు. ఆ ప్రశ్నము లీయూర నుండియే యరయదగినది. ఆ రాజపుత్రిక నిత్యము చేయు కృత్యములెట్టివో గ్రహింపవలయును. కావున నీ వీనగరములో గుమ్మరుచు ననుదినము నా చిన్నదానిచర్యలం దెలిసికొనుచుండుము. నేనును తగుప్రయత్నము చేసెదనని పలికి యతండది మొదలు ప్రతిదినము నట్టి ప్రయత్నము చేయుచుండెను.

అని యీ కథ నింత పట్టు జెప్పువరకు నర్ధరాత్ర మగుటయు మణిసిద్ధుం డాగోపాలుని జూచి వత్సా యిప్పుడు నిద్రవేళయైనది. తరువాత కథయు పెద్దదిగా నున్నది ఈ రాత్రి ముగియులాగున దోచుటలేదు. సంక్షేపముగా ముగింపనా? లేక యా తరువాయి కథ ముందర మజిలీలో జెప్పనా? యని యడుగగా వాడు కథ సవిస్తరముగా జెప్పవలయునుగాని ముగింపరాదు. పోనిండు మీకు నిద్రగానుండినం బరుండుడు రేపు చెప్పవచ్చునని పలుకుచు నప్పుడు భుజించి లేచి యయ్యతిచంద్రుని పాదంబు లొత్తుచుండెను. అయ్యోగియు నారాత్రి సుఖముగా వెళ్ళించి వేగుజామున లేచి గోపకుమారుని కావడి యెత్తుమని పలుకుచు మౌన మవలంబించి తనతో వాడు కావడి మోచుకొని నడచుచుండ నీరెండ ప్రొద్దెక్కువరకే ముందరి మజిలీ చేరెను.