పుట:కాశీమజిలీకథలు -02.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

190

కాశీమజిలీకథలు - రెండవభాగము

సమయములో సందియమందగూడదని పలుకుచు దానినెక్కించి చందనపుగిన్నె చేతికందిచ్చినది. అప్పుడాపడతి యాగందమతని మేన బూయదొడగినది కాని యత డించుక సంశయించువానివలె నభినయించుచు నించుబోడి! చాలుచాలు నీసపర్యకు సంతసించితిని నాకు జెప్పవలసినసంగతు లేమైనం గలిగిన నుడువుము నేను వేగముగా బోవలయుననగా విని యాచతురిక వాని కిట్లనియె.

ఆర్యా! చల్లకువచ్చి ముంతదాచనేల? మిమ్మూరక బోయెదననిన బోనిత్తుమా? మీరేమియు మాటాడగూడదు. మేముచేసినట్లొడం బడుడని పలుకుచు గాంతిమతింజూచి రమణీ! నీవు సంశయింపకుము మేనంతయు జక్కగా గంద మలందు మని పలికిన నక్కలికియు నట్లుచేయుచు జివర జెక్కులకుగూడ రాచినది అప్పుడచ్చతురిక కాంతిమతింజూచి యోహో! నీవు అతిథికి మంచిమర్యాదయే చేయుచుంటివి ఆయనమాత్ర మూరకొనునా? నీకు దగినట్లు మరలజేయును చూడుమని యాగందపు గిన్నె యాతినిచేతి కందిచ్చినది. అతం డది యందిపుచ్చుకొని సాహసముతో గాంతిమతి జెక్కులయందు నొక్కి రాచెను.

అప్పు డయ్యిరువురకు మేనం బులకలు బొడమినవి కంప మావిర్భవించినది చెమ్మటలు గ్రమ్మినవి మరియు జిత్తభవుండే వారికి బురోహితుండై పాణిగ్రహణోత్సవమునకు సంకల్పము జెప్పదొడంగెను. పిమ్మట నెద్దియో మిషబన్ని చతురిక యవతలకు జారినది. అప్పు డక్కాంతిమతి మొగంబున నించుక కినుక యభినయించుచు అయ్యో! అతిథి యింటికి వచ్చెనని మర్యాదజేయుచుండ నిట్టిపనులు చేయవచ్చునా? ఈగంద మిట్లెయుంచి మా పెద్దలకు జూపించెద నుండుడు అని బెదరించిన నతడు నవ్వుచు నౌను నేను జేసినదితప్పే? మరల దుడిచెదగాకయని పలుకుచు తుడుచువాని వలె నభినయించుచు జెక్కులు నొక్కుచు నీరీతి గొంతసేపు కేళీవిలాసములు చూపుచు-

శ్లో॥ కంఠెసంశ్లిష్యగాఢం మృదుకరజచయం గండపాళీనితంబె
     పృష్టెపార్స్వోదరెవా విధధదైః ఖండయన్ దంతవాసః
     ప్రేమాచుంబన్ లలాటంవపుషిచ జనయన్‌రోమహషన్ నితాంతం
     సీత్కారాకారి వక్త్రామతిలఘునళినీంద్రావయేత్తాం విదగ్ధాః॥

అని చెప్పినట్లుగా నాపద్మినీకాంత నాద్యంతక్రీడావిశేషంబుల సంతోషవివశం గావించెను.

అంతలో సాయంకాలమగుటయు జతురికవచ్చి యువతీ! మనమింటికి బోవలయును. రేపు మరల రావచ్చును. పోదము లెమ్మని పలుకగా నెట్టకేల కతని కౌగిలి విడదీసికొని ఆర్యా! నీవు మరల మేలిముసుగు వైచుకొని మాతో వచ్చి బండిలో గూర్చుండుము. మిమ్ము జతురికయింటియొద్ద దింపెదనని చెప్పి యట్టివేషముతో