పుట:కాశీమజిలీకథలు -02.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంతిమతి కథ

191

నతని దీసికొనిపోయి బండియెక్కినది. చతురికయు నొకప్రక్కను గూర్చుండెను. పిమ్మట బండివాడు బండిదోలుచు ముందుగా రాజపుత్రిక యాజ్ఞప్రకారము చతురిక యింటియొద్దకు దీసికొనిపోయెను. అచ్చట మేలిముసుగుతో నదృష్టదీపుడును చతురికయు బండిదిగి యింటిలోనికి బోయిరి. పిమ్మట నా శకటమును గన్యాంతఃపురమునకు దీసికొనిపోయెను.

కాంతిమతియు బండిదిగి యింటిలోనికిబోయి యాహారనిద్రాసమయంబుల సైత మతని క్రీడావిశేషములనే స్మరించుచు నతిప్రయత్నమున నారాత్రి వేగించినది. అంత మరునాడు పూర్వదివసంబువలెనే తాను ముందుగా బండి యెక్కిపోయి తరువాత నచ్చతురిక యింటికి బంపిన నదృష్టదీపునితో నచ్చతురిక దానిలో నెక్కి యుద్యానవనము లోనికిబోయి యక్కుమారు నంతఃపురమునకుం బంపి తాను ద్వారమున గాచి యుండెను.

ఆ యిరువురు యధేష్టగా కామక్రీడావిశేషంబులం దేలుచుండ వారి కాదివసంబంతయు నరనిముషములాగైన దోచినదిగాదు. సాయంకాలమైన తోడనే పూర్వపురీతి వారు మువ్వురును బండియెక్కి యిండ్లకు బోయిరి. ఆ ప్రకారము ప్రతిదినము నుదయమున నా బండియెక్కి యుద్యానవనమునకు బోయి సాయంకాలమువరకు గ్రీడించుచు రాత్రి కిండ్లకు బోవుచు నారుమాసము లఱిగిన నాయిరువురకు నక్కాలమొక దివసములాగైన దోచినదికాదు.

అట్లుండనంత నొక్కనాడక్కాంతిమతి తండ్రి యనంతవర్మ యాస్థానమునం గూర్చుండి రాజకార్యములు వితర్కింపుచుండ నతని బల్లమీద నొక యుత్తరము గనంబడుటయు నతండది విప్పి చదువ నిట్లున్నది. రాజా! నీవు వట్టిగ్రుడ్డివాడవు. నీ యింట జరుగుచున్న యవమానకృత్యము లేమియు గురుతెఱుగకున్నావు. నీవు కూతురు నందుగల మక్కువచే దానినేమియు నాజ్ఞ బెట్టక స్వేచ్ఛగా దిఱుగుచుండ నిచ్చితివి. అప్పడతి యిప్పుడు నిష్కుటములో బ్రతిదినము నొకపురుషునితో గ్రీడింపు చున్నది. ఉదయమునబోయి సాయంకాలమున కంతఃపురము జేరును. ఆ విషయము నీ వేమియు విమర్శింపకుంటివి. యౌవనములోనున్న రాజకన్య లెవ్వరేని గోటదాటి క్రీడింపబోవుదురా! స్త్రీలకు స్వతంత్ర మిచ్చినచో మర్యాద నిలుచునా! తనయయెడ మక్కు వగలిగినచో మిక్కిలి గుడుచుటకును గట్టుటకును బెట్టవలయునుగాని యిట్లు స్వేచ్చగా దిరుగనీయరాదు. అదియునుం గాక పురుషులకంటె స్త్రీలకు గామమధికము గదా? యౌవనము వచ్చిన మచ్చకంటికి వెంటనే వివాహము జేయకుండినతప్పు నీయదియే. మఱియు నత్తరుణి యిప్పుడు గర్భవతిగూడ నయ్యెనని నాకు దెలిసినది. స్వచ్ఛమైన నీ కులమునకు గళంకము వచ్చెనని నేను జింతించుచున్నవాడ. నీకు నేను నత్యంతప్రియుండగాన నింతగా వ్రాసితిని. నామాట నిక్కువమరయ తలంపుకలిగెనేని సాయంకాల మాయుద్యాన వనమునకు బోయిన నంతయు నీకే విశదము కాగలదు.