పుట:కాశీమజిలీకథలు -02.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

188

కాశీమజిలీకథలు - రెండవభాగము

సంతోషింపుచు గాంతిమతి నంటిన స్మరపిశాచము ఈ చిన్నవానికిగూడ నావేశించినది. మేలు మేలు. ఇక నా సఖీమణి యభీష్టము దృటిలో నెరవేర్చెదనని తలంచుచు వారున్న యింటి తలుపులు తట్టుచు బలభద్రా! బలభద్ ! యని పిలిచినది.

ఆకంఠధ్వని గురుతుపట్టి యదృష్టదీపుడు మిగుల సంతోషముతో బలభద్రా! చూడు మెవ్వరో పిలుచుచున్న వారని పలుకగా వాడులేచి తలుపు తెరచి ద్వారములో నున్న చతురికంజూచి వయస్యా! నిన్న నీతో మాట్లాడిన చేడియ వచ్చినదని చెప్పెను. అప్పుడతడు లోనికిదీసికొని రమ్మని చెప్పిన బలభద్రుండట్లు చేసెను. మంచముమీద గూర్చుండి చతురిక కొకగద్దె వేయించి చతురికా! నేడు ప్రొద్దుననే వచ్చితివేమని యడిగెను.

అదియు ఆర్యా! మరేమియు గార్యము లేదు. నిన్న మీతో మాట్లాడుట కవకాశము చిక్కినది కాదు. నన్ను గుఱించి మీరు మిక్కిలి శ్రమపడిరి. కృతజ్ఞత జూపించుకొనుటకై వచ్చితిని. మఱియు మా రాజపుత్రికయు మీతో ముచ్చటింప వలసియున్నదని చెప్పినది. దేనికిని నిన్న వేళ చాలినది కాదు ఈ దినము సావకాశముగా మాటలాడుకొనవచ్చును. ఇప్పుడే యప్పడతి మఱియొక యుద్యానవనమునకు బోయియున్నది. మిమ్ము నచ్చటికి దీసికొని రమ్మని నన్ను బంపినది నిన్నటిదినంబున దా నేమియు దమకు నతిథిపూజ సేయలేదట. దానికి నార్యపుత్రుని చిత్తంబున మఱియొక రీతి దలంపు గలిగెనేమో యని రాత్రి బరితపించుచున్న యది. ఆ యుద్యానవనము మిక్కిలి విశాలమైనది. అరణ్యమును బోలియుండును. అందు సుందరములగు మందిరములు గలవు. ఇప్పుడే దేవర యచ్చటికి విచ్చేయవలయునని ప్రార్ధించిన నతండు చిరునగవు మొగమునందొలుక నల్లన దానితో నిట్లనియె

చతురికా! నీవు కృతపరిచయురాలవగుటచే నీమాట నేను ద్రోయలేకున్నాను. నీ కృతజ్ఞత్వమునకు మిక్కిలి సంతోషించితిని. మీ రాజపుత్రిక నాకు సపర్యలు చేయలేదని సందియ మందవలదని చెప్పుము. దర్శనమాత్రముననే యర్చితుడ నైతిని. మరల నన్నేల శ్రమపెట్టెదవు? రాజభటరక్షితమగు నాయుద్యానవనమునకు బోవుట దుర్ఘటము గదాయని యర్ధాంగీకారముతో బలుకుచున్న యాచిన్నవాని చేయిపట్టుకుని యచ్చతురిక లెండు. లెండు. తక్కినవాని గురించి మీకేమియు చింతింపవలసిన యవసరములేదు. అవియన్నియు మేము చక్కబెట్టుకొనియెదము. మన మిప్పుడే పోవలయును. మనకొరకు రాజపుత్రిక నిరీక్షించుకొని యుండునని పలుకగా నతండు అయ్యో! ప్రాతఃకృత్యములు నిర్వర్తించుకొని పెందలకడ భుజించివత్తునని పలికెను.

అప్పుడచ్చతురిక ఆర్యా! అవియన్నియు నచ్చటనే తీర్చుకొనవచ్చును. మీకు విందుచేయవలయునను తాత్పర్యముతోడనే రాజపుత్రిక మిమ్ముదీసికొనిరమ్మన్నది. ప్రాతఃకృత్యములు మాయింటియొద్ద జరిగించవచ్చును. రండు రండు అని