పుట:కాశీమజిలీకథలు -02.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

182

కాశీమజిలీకథలు - రెండవభాగము

లతచే నట్లు వ్రాసితివనియు నాతో బంతమాడినది. నే నెంత జెప్పినను నొప్పుకొనినదికాదు. అందుమూలమున మాయిరువురకు వాదముగలిగినది. నిజముగా నట్టిపురుషుని జూచియే వ్రాసితినని నేనును యిట్టిసుందరు డీలోకమున లేడని యచ్చేడియయును బెద్దతడవట్లు పట్టుదలతో వాదులాడికొంటిమి. తుదకిట్లు వానిజూపితివేని నీకు వేయిదీనారములు బారితోషికమిత్తునని యమ్మత్తకాశిని నాతో యొత్తి పలికినది.

అట్టి శపధ మారాచపట్టి చేసినతోడనే నేను మిగుల సంతోషించుచు మీయొద్దకు బరుగెత్తుకొని వచ్చితిని. ఆర్యా! ఆ సొమ్మంతయు మీరిచ్చినట్లు సంతోషించెదను. నన్ను గురించి కొంచెము శ్రమపడవేడెదను. మాబోటిదీనుల మొరవినుట మీవంటి యుత్తములకు సహజ ధర్మముగదా? ఒక్కసారి యాచక్కెరబొమ్మ కన్నులం బడినంజాలును. అసొమ్ము నాకుదక్కును. అక్కలకంఠియు మిక్కిలి చక్కనిది. చూడు డిదిగో? దాని యాకృతిసైతము దీసికొనివచ్చితినని తనచేతిలోనున్న యాచిన్నదాని పటమును వానికి జూపించెను.

దానింజూచినతోడనే యతనికిగూడ చిత్తవిభ్రాంతి గలిగినది. అంతలో దెలిసికొని యమ్మోహము వెల్లడికానీయక యోహో! యిట్టి మోహనాంగి భార్యగా నుండినప్పుడుగదా సౌందర్యవంతునికి సాద్గుణ్యముగలుగును. ఇది నన్ను మాయ జేయుటలేదుగదా? నిక్కముగా నిట్టి సుందరీమణు లుందురా? కానిమ్ము. నాకు దానిం జూపింతునని చెప్పుచున్నది. పిమ్మటనే యాలోచింపవచ్చును. అని తలంచుచు దన హృదయముననున్న యభిలాష ప్రకటనగానీయక దానితో నల్లన నిట్లనియె.

చతురికా! నీవతి చతురవు. ఎట్లు వ్రాసినను వ్రాయగలవు. సంతతము నంతఃపురములలో గ్రుమ్మరు మీకాంతిమతికి నన్నెట్లు చూపెదవు? ఇక్కడకువచ్చునా? ఈ పటమువిషయమై నాకును నట్టి యనుమానము గలిగియున్నది కానిమ్ము. తీసుకొని వచ్చితివేని నాసంశయమునుగూడ విడగొట్టినదాన వగుదువు. పొమ్మని పలుకగా నద్దూతిక మరల నిట్లనియె. అయ్యా ! మీకు సర్వమును తెలియును. మీమాట కాదనుటకు నాకు సామర్థ్యమున్నదియా? ఆ కాంతిమతి నిచ్చటికి రమ్మనినచో ముచ్చటతో వచ్చుట కెంతమాత్రము సందియములేదు. కాని లోకోపవాదమునకుఁ గొంచెము వెఱవవలయును గదా! మగవారనిన స్వతంత్రులు. మీ రంతఃపురమునకు రానవసరములేదు. ఆచిన్నదాని మేడక్రిందనుండి వెళ్ళినచో నాకొమ్మ మిమ్మును జూచును. పిమ్మట నాయభీష్టము నెరవేరగలదు. అని వేడుకొనగా నతడు కాంతిమతిని జూచుటకు దనకు మిక్కిలి యుత్సాహము గలిగియున్నది గావున దనవలపు వెల్లడిగానీయక పరోపకారమునకై యొడంబడువానివలె సమ్మతించెను.

తరువాత నచ్చతురిక యారెండుచిత్రఫలకములు సరిగాబట్టుకొని యతనికి జూపుచు ఆహా! యీరెండుపటములు నెంతవింతగా నున్నవియో చూచితిరా యని పలి