పుట:కాశీమజిలీకథలు -02.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంతిమతి కథ

183

కెను. అతడు దాని యభిప్రాయము గ్రహించియు నెఱుగని వానివలె నీవు మిగుల నేరుపుగా వ్రాసినప్ పుడింపుగానుండ కెట్లుండునని యుత్తరముజెప్పెను. అద్దూతిక సంతసించుచు సాయంకాలమునకు గాంతిమతి మేడక్రిందుగా బోవున ట్లతనిచే నొప్పించుకొని యామార్గము గురుతుజెప్పి యప్పుడే పోయినది.

అంతట నయ్యదృష్టదీపుడు దాని మాటలధోరణియంతయుం జూచి యా చిన్నది తన్ను వలచియుండినట్లు గ్రహించి యాసంగతు లన్నియు బలభద్రునితో ముచ్చటించుచు నెట్లైనను మెలేయని యది చెప్పినచొప్పున సాయంకాలమునకు జక్కనివేషముతో నామేడక్రిందనుండి యిటునటు మూడుసారులు తిరిగెను. అప్పుడు పైనుండి కొన్నిపూవు లతనిమీద బడినవి. దానికి వెరగందుచు దలపైకెత్తి చూడగా జంద్రబింబమో యన నొప్పుచున్న చక్కని మొగంబొకటి గనబడినది. దానినట్లు రెండు మూడుసారులు చూచుచు మరల తలవంచుకొనుచు నింతలో నితరు లామార్గమున నడచుచుండిరి కావున నిలుచుటకు వీలులేక మరల నింటికిబోయెను. ఆవెంటనే యా చతురిక చనుదెంచిన జూచి యారాజకుమారుడు మందహాసము సేయుచు సుందరీ! నీయభీష్టము తీరినదా! అనిన ప్రకారము నీకు రాజకుమార్తె సొమ్మిచ్చినదా యని యడుగగా నది తలయూచుచు నిట్లనియె. ఆర్యా! మిమ్ము వృథాశ్రమ పెట్టినందులకు జింతించుచున్న దానను. ఎంతవారికైనను సొమ్ము విడుచుట గష్టముగదా! అమ్ముద్దియ యెద్దియో వంకబెట్టి పన్నిదము గెలువ వలయునని తలంపు గలిగియున్నది దూరముగా నుండుటచే మిమ్ము బరిశీలించుటకు వీలుపడినదికాదట. ఆచిత్రఫలకమును మిమ్మును దగ్గరనుంచుకొని చూచునప్పుడుగాని నమ్మదట. దీనికి నేనేమి సేయుదును. అట్టిపని యెట్లు తటస్థించునని నేను దానినే యడిగితిని దాని కచ్చిన్నది కొంతేసేపాలోచించి నేను రేపు ఉద్యానవనములోనికి వత్తుననియు నచ్చటికి దీసికొనిరమ్మనియు జెప్పినది. ఆవార్త దేవరవారికి విజ్ఞాపన సేయుటకై వచ్చితిని. నన్ను గురించి యిందొక్కసారి శ్రమపడవలయును. మీయుపకార మెప్పటికి మరచుదానను కానని ప్రార్థించినది.

దానిమాటలు విని యతం డోహో! కొంచెము చనువిచ్చిన నెక్కుడు చొరవ చేయుచుంటివే! పాపము దీనురాలుగదా యని యొకసారి మాటవినినచో వెండియు రమ్మని నిర్బంధించుచుంటివి. శుద్ధాంతకాంతల చెంతకు మేము వచ్చినచో భూకాంతు డెఱింగిన శిక్షింపడా? ఇదియుంగాక ద్వారరక్షకులు శంకింపరా! మా కంత శ్రమపడవలసిన యవసరమేమని తన హృదయమున నవ్వనితంజూడ వేడుకయున్నను బోవనీయక దానితో నిష్టములేనివానివలె బలికెను. ఆ మాటలకది యించుక గొంకుచు అయ్యా! ఇప్పుడు మీరు రానిచో నామాట దబ్బర అగుటయేకాక ద్రవ్యనష్టము కాగలదు. మీరు మొదటబడిన ప్రయాసమున కించుకయు సార్ధకములేదు. నాయందు దయయుంచి యొక్కసారి రావలయును మిమ్ము ద్వారరక్షకులు శంకింపకుండ నేను