పుట:కాశీమజిలీకథలు -02.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంతిమతి కథ

181

కాదు. సంతోషమైన పనియే. మీవలన గొప్పలాభము పొందవలయునను తాత్పర్యముతోనే యిట్టిపని కుద్యోగింపుచున్నదాన ననుగ్రహింపుడు. ఒకనిముషము మాత్రము స్థిరులై యుండుడని పలుకుచు నతండొడంబడి యట్లు నిలుచున్న యాతని యాకృతి నచ్చుగ్రుద్దినట్లు వ్రాసి యతనికి జూపినది.

ప్రతిబింబమువలెనున్న తన యాకారము జూచికొని యదృష్టదీపుడు దాని శిల్పినైపుణ్యమునకు మెచ్చుకొనుచు నాఫలకము దాని చేతికిచ్చెను. అమ్మగువయు నగుమొగముతో దానినందుకొని కడు వేగముగాబోయి కాంతిమతిచేతి కా పటమిచ్చినది. దానింజూచినతోడనే కాంతిమతి మూర్ఛవోయి కొంతకు దెలిసికొని చతురికా! నిజముగా నతండిట్లుండెనే లేక నన్నాడించుటకిట్లు వ్రాసితివా! యిట్టి రూపముగల పురుషం డుండుట కథలమాటకాని సత్యమగునా! ఏమే చెప్పుము. చెప్పుము. నీకన్న నా కెవ్వరు. ఇట్టి సమయములో నాతో బరిహాసమాడకుము నేనీ పాదంబులకు మ్రొక్కెదనని మిక్కిలి విరాళిందూలి పలుకుచున్న యాజవరాలింజూచి యాచతురిక నవ్వుచు జవ్వనీ? నీతో నేను పరిహాసమాడుదునా ? నిజముగా నతనియాకృతి యంతయును వ్రాయుటకు నలవడినదికాదు. అట్టిరంగులు నాయొద్దలేవు. పోలిక మాత్రము వ్రాసితిని. అతని చక్కదనం బింతయని చెప్ప శక్యమా? తొందరపడకుము. నీకతనిం జూపెదనని పలుకగా నాచిలుకలకొలికి మరల నిట్లనియె.

అయ్యో! నీవెన్నడో చూపెదనని పలికిన నేను దాళగలనా? యెప్పుడు చూపెదవో నిజముగా జెప్పుము. స్వాంతమున గంతుసంతాప మంతకంత కగ్గలమగుచున్నది. లెమ్ము లెమ్ము ఇప్పుడేపోయి వానిందీసికొనిరమ్ము. నీకు మంచిపారితోషిక మిత్తునని మిక్కిలి తత్తరముగా బలికిన విని, కలికీ! నీతొందర చూడ నాకు వింతగా నున్నది. అతనిని దీసికొని వచ్చుటకు పైపైనున్నవా డనుకొంటివా యేమి? నాతో మాట్లాడుటయే దుర్ఘటమైనది నేనట్టి కారణము పన్నబట్టి యందులకొడంబడెను. కానిమ్ము మరలబోయి నాయోపినంత యుపాయములబన్ని వానిం దీసికొని వచ్చెద. ననుజ్ఞ యిమ్మని పలికి కాంతిమతి చిత్రపటమునుగూడ తీసికొని యతనియొద్దకు బోయినది.

దానించూచి యదృష్టదీపుడు నవ్వుచు ఏమే మరలవచ్చితివి? వ్రాయుటలో మరియేదైనను మఱచిపోయితివా యేమి? విశేషము లెట్టివని చనువుగా మట్లాడుటయు నచ్చతురిక కృతపరిచయు డైన యతనితో మెల్లన నిట్లనియె. అయ్యా! నేను దమ యనుగ్రహమువలన నా చిత్రఫలకము నద్ది యనేక పటములు తీసితిని. పెక్కండ్రు కొనగలరు. యేశంకయు జేయలేదు. మారాజుగారికి గాంతిమతియను యథార్ధనామము గల కూతురుగలదు అక్కన్యక విద్యావయోరూపవిషంబుల ననపద్యయై యున్నది. నేనీచిత్రఫలకమును గొనియెదవాయని దాని యొద్దకు దీసికొనిపోయితిని. అయ్యతివయు దానిని బరీక్షించి చూచి నేను జెప్పినమాట నమ్మక యిట్టిపురుషుడు లేడనియు నీబుద్ధికుశ