పుట:కాశీమజిలీకథలు -02.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

180

కాశీమజిలీకథలు - రెండవభాగము

దెలియగోరి ప్రచ్ఛన్నముగా నతనివెంట రెండుమూడునాళులు తిరిగితిని. ఒకనాడు వానికిని వాని మిత్రునికిని జరిగిన సంవాదమిట్లున్నది.

మిత్రమా! పుడమియంతయు నీకీర్తి వ్యాపించినది. నిన్ను మాత్ర మెవ్వరు నెరుగరు. నీచాతుర్యము మిగుల గొనియాడదగినదే. నీవు మిగుల పుణ్యాత్ముడవని యాప్తుడు పలుకగా విని యాప్రోడ బలభద్రా! నేనెంతవాడినైన నేమిలాభమున్నది. నాతల్లిదండ్రులును సోదరుడు గనంబడినప్పుడుగదా నాకీఖ్యాతికి సార్ధకము. అడవిగాచిన వెన్నెలవలె నాచాతుర్యము నౌన్నత్యమును జూచి మెచ్చువారెవరు? ఆహా! తలిదండ్రులచే మన్ననల జెందువారెంత పుణ్యాత్ములోకదా యని పలుకుచు విచారింప దొడంగెను. దీనిబట్టి చూడనతండెవ్వడో విఖ్యాతిగల పురుషుడువలె దోచుచున్నది. కారణాంతరమున బ్రచ్ఛన్నవేషముతో దిరుగుచున్నవాడని తలంచెదను. అతడు తప్పక నీకు దగినపురుషుడు. నీవువానిం జూచితివేని విరహవేదన జెందగలవని పలుకగా విని యాకాంతిమతి రాగవిష్టహృదయయై సంభ్రమముతో నిట్లనియె.

చెలీ! యాభాగ్యశాలి నాకెట్లు కనంబడును. వాని నాకు జూపి నీవాక్యము లన్వర్ధములు చేసికొనవా! యేది యుపాయము వానిందర్శింప నాహృదయము తత్తర మందుచున్నయది. యేమిచేయుదము! వేగము చెప్పుమని యత్యాతురముగా బలుకుటయు నచ్చతురిక నవ్వుచు నోహో! సఖీ! నీవాతనింజూడకయే యింత తొందర పడుచునుంటివి! చూచినతరువాత నన్నెంత వేసెదవోకదా! కానిమ్ము ముందుగా నతని యాకృతి జిత్రపటంబున వ్రాసికొనివచ్చెదను. దానింజూచిన తరువాత నీకు నింపుగా గనంబడినచో నతనింజూచు ప్రయత్నము చేయుదమని పలుకుచు గాంతిమతి యనుమతి వడసి తూలికయు బటమునుగొని యదృష్టదీపుడున్న చోటికి బోయినది.

ఆ సమయమున నతండు బలభద్రునితో నిష్టగోష్టి మాటలాడుచుండెను. అతనియొద్దకు మెల్లనబోయి నమస్కరింపుచు ఆర్యా ! మిమ్ము నీయూరిలో పదిదినములనుండి చూచుచుంటిని. మిమ్ముజూచినపుడెల్ల మీవృత్తాంతమించుక దెలిసికొన వలయునని యభిలాషకలుగనదికాని యెప్పుడును ప్రశ్నావకాశము దొరికినదికాదు. నేడిదియే పనిగా నిచ్చటికి వచ్చితిని. నాకు జిత్రపటములు వ్రాయునేరుపు గలిగియున్నది. చక్కనివారి పటములు వ్రాసి యమ్ముకొనుచుందును. నాకిదియే జీవనము. మీయాకృతిజూడ ననన్యసామాన్యమై యున్నది. మీరూపము వ్రాయవలయునని యుత్సవముగానున్నది. నా విజ్ఞాపనము మన్నింపవలయునని వినయముగా బ్రార్ధించిన నతండు నవ్వుచు నిట్లనియె.

బోఁటీ! మా కాపురము కాశీపురము. నా పేరు హరిదాసు. నే నీయూరు విహారార్ధమై వచ్చితిని. సామాన్యమానవుడైన నా రూపము వ్రాసికొనిన నీకేమి లాభము దొరకును. ఈ ప్రయాసము నీకేల నని పలుకగా విని యది యతని నప్పటి ముఖచర్యలం బట్టి మరుగుపెట్టి పలికి నట్లూహించుచు నార్యా! నాకిది ప్రయాసము