పుట:కాశీమజిలీకథలు -02.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అదృష్టదీపుని కథ

179

ఆ సన్యాసి మాటలు విని యతం డదరిపడుచు అయ్యో! నా తల్లిదండ్రు లెక్కడనున్నవారో కదా? పాముగరచి చనిపోయినది మాతల్లి కాదు కాబోలు. నాకొక తమ్ముడుగూడ గలిగియున్న వాడట. అట్టి వాడెప్పుడు గనంబడునో? ఈ సన్యాసి మాటలు తథ్యములు. అని తలంచుకొనుచు నా సన్యాసితో స్వామీ? మీ దయయుండినచో నేకొదవయు లేదని చెప్పి యతనిచే ననుజ్ఞాతుడై యింటికి బోయెను.

కాంతిమతి కథ

ఆ సమయంబున నాపట్టణపు రాజకూతురు కాంతిమతియను కన్యామణి చెలికత్తెయ చతురికయనునది యందు గూర్చుండి యా సన్యాసి చెప్పిన మాటలన్నియు వినుచుండెను. అచ్చతురికయు దన ప్రాణసఖురాలి కనుకూలుడగు భర్త లభించునో లభింపడో యా సన్యాసిని దెలిసికొను తాత్పర్యముతో నచ్చటికి వచ్చినది. కావున నట్టి మాటలు వినినతోడనే యదృష్టదీపుని బరీక్షించి చూచి యతని సౌందర్యవిశేషమున కచ్చెరువందుచు నితండే కాంతిమతికి దగినవాడు. వీనివెంట రహస్యముగా బోయి కులశీలనామంబులు దెలిసికొనివచ్చెదఁగాకయని నిశ్చయించి యట్లు చేసినది. అతని వెంట రహస్యముగా రెండు మూడు దినములు తిరిగి యతని చర్యలన్నియుం గ్రహించి తరువాత గాంతిమతి యొద్దకు బోయినది.

అక్కాంతిమతియు దాని ముఖవిలాసముల గనిపెట్టి యేమే చెలీ! ఇన్నాళ్ళు చేసితివేమి? యాస్వాములవారి దర్శనమైనదా? మాట్లాడుటకవసర మిచ్చెనా? మన సంగతులన్నియుం జెప్పితివా? ఆయన యేమి సెలవిచ్చెనో చెప్పుము. మన కోరిక సఫలమెప్పటికైన నగునా? వేగము జరిగిన విశేషములన్నియుం జెప్పమన నది ముసి ముసి నగవులు నవ్వుచు గాంతిమతి కిట్లనియె. భర్తృదారికా! మనకు సన్యాసి యేమియు జెప్పనక్కరలేదు. భగవంతుడు తానే తీసికొనివచ్చెను. నీయభీష్టదేవతలు ప్రసన్నులైరని చెప్పగా విని యవ్వనిత తొందర పడచు చెలీ! ఎట్లెట్లూ వేగము చెప్పుము. నీ మాట వినుదాక తాళకుంటినే యని యడుగ నది మరల నిట్లనియె.

బోఁటీ! నేనా సన్యాసియొద్దకు బోవువర కొకచక్కని కుమారరత్న మయ్యతిచేత జేయిజూపించు కొనుచుండెను. అతని చేతిరేఖలు చూచినతోడనే నాలుక గరచుకొనుచు నాసన్యాసి మిక్కిలి వెఱగుపడి నీవీభూమండలమంతయు నేలగలవనియు నదృష్టదీపునంత ఖ్యాతి సంపాదింతువనియు జెప్పెను. అక్కుమారుని సౌందర్య మడిగితివేని కంతువసంత జయంతాదులకన్న మిన్నగానున్న వాడు ఆహా! వాని జవ్వనము, పొంకము, లావణ్యము, సౌకుమార్యము, చూచి తీరవలయుంగాని చెప్పిన దెలియదు. అట్టివాడు నీకు దగినవాడని నిశ్చయించి మరియు నాతనివృత్తాంతము