పుట:కాశీమజిలీకథలు -02.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అదృష్టదీపుని కథ

175

యదియోకదా ! ఆయన దర్శనముజేసిన ధన్యులగుదుము. మరల నివియే పంపుచు మరికొన్ని యేనుగులమాత్ర మధికముగా నిచ్చువాడ. నేనుగూడబోయి యమ్మహాపురుషుని పాదములంబడి యపరాధము జెప్పుకొనియెదనని తలంచి యా కానుకలు దెచ్చిన కింకరులతో నిట్లనియె.

రాజభటులారా! మీ రాజుగారుచేసిన సత్కారమునకు నేను మిక్కిలి సంతసించితిని. ఆయనకు బ్రతిసత్కారము నేనేమియు జేయలేను. స్వయముగావచ్చి యాయన పాదంబులం బడియెద, ఆయన ప్రసిద్ధి జగంబంతయు నిండియున్నది. అట్టివారి దర్శనము చేయుటకంటె పుణ్యమున్నదా ఆదేశ మెచ్చటనున్నది! అయ్యమరావతికి బోవుమర్గమెట్లు? నాకు రాజుగారిదర్శనము జేయింతురా? యని యడుగగా నాకింకరులిట్లనిరి. దేవా! ముందుగా నేను వచ్చుచున్నానని యాయనపేర యుత్తరము వ్రాసి యాయన యనుమతి వడసిపోవలయును. మీకట్టి యుత్సాహము గలిగియున్నచో నుత్తరము వ్రాసి మా చేతికిండు మేము పోయి ప్రత్యుత్తరము తీసుకొని వత్తుమని చెప్పగా నా రాజు సమ్మతించుచు నారీతి ప్రార్ధనాపూర్వకముగా నుత్తరము వ్రాసి యా వస్తువాహనములతో గూడ దమభటుల గొందర బంపి బ్రత్యుత్తరము తెమ్మని యాజ్ఞాపించెను.

అదృష్టదీపుడు తన భటులకు జేయవలసిన కృత్యములన్నియు నంతకు పూర్వమే బోధించియున్నవాడు. కావున వాండ్రలో గొందరు ముందుగాబోయి మలయధ్వజుని దూతలువచ్చుచున్నట్లు చెప్పిరి. అదృష్టదీపు డప్పు డాలోచించి యోహో! పెక్కెండ్రు రాజులు నన్ను జూడవలయునని ప్రయత్నించుచున్నట్లు దెలియుచున్నది. నా గుట్టుబయలైనచొ నిదివరకు వ్యాపించిన కీ ర్తియంతయు గళంకమై పోవును. కనుక నీరీతియంతయు గట్టిపెట్టి కొన్నిదినములు ప్రచ్ఛన్నముగా నుండుటయే యుత్తమమని తోయుచున్నది. ఇప్పుడా భటుల నిచ్చటికి రానీయగూడదు.

అని తలంచుచు మలయధ్వజునిపేర నదృష్టదీపమహారాజుగా రిప్పుడు తీర్థయాత్రకు బోయినారనియు గొలదిదినములలో వచ్చుననియు వచ్చిన తరువాత మేముత్తరము వ్రాయుదుమనియు నప్పుడు రావలయుననియు నొకయుత్తరము మంత్రి వ్రాసినట్లు వ్రాసి దానిమలయధ్వజుని కింకరుల కెదురుగా దీసుకొనివెళ్ళుమని పంపెను. మరియు మలయధ్వజు డిచ్చిన ద్రవ్యమంతయు దానధర్మముల క్రింద నొక్కదినమున పుణ్యక్షేత్రములలో బంచిపెట్టవలయునని కింకరుల కాజ్ఞాపించె. ఆయుత్తరముల జూచికొని మలయధ్వజుని దూతలు అదృష్టదీపుని దాతృత్వమునకు విస్మయమందుచు నతండు లేనప్పుడు పోవుటయేలనని యచ్చటనుండియే మరలి తమ పురమునకు వచ్చి యాయనచర్యలన్నియు నన్నియు నద్భుతముగా జెప్పియతని నాశ్చర్యసాగరంబున నీదులాడజేసిరి.