పుట:కాశీమజిలీకథలు -02.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

174

కాశీమజిలీకథలు - రెండవభాగము

వేలకొలది భుజించుటకు నుపయుక్తముగా నున్నవి. పుడమిలో నదృష్టదీపుని పేరనున్న సత్రములన్నియు నారీతిగానే వేయబడినవి. కావున వానిలో నేకొదవయు నుండదు. యజమానుని యవసర మెప్పటికిని దిరుగా గలుగదు. సత్రాధికారులు గూడ నా యదృష్టదీపు డెచ్చటివాడో యెట్టివాడో యెవ్వడో గురుతెఱుగరు. రాజులందరు నొండొరు లతని ప్రశంస దెచ్చుటచే వెఱగందుచు నతండెచ్చటివాడనియు నమరావతీరాజధాని యే దేశములోనిదనియు నతనికెంత దేశమున్నదనియు నత డెంత బలవంతుడనియు బ్రశంసింపజొచ్చిరి. కాని యతని నిజస్థితి యిట్టిదని యొక్కనికిని దెలిసినదికాదు.

అప్పుడు రాజులందరు సభజేసి మనకందరకు మిత్రుడైన యదృష్టదీపుని వృత్తాంతము దెలియకుండుట యుచితముగా నుండలేదు. ఇప్పుడు తప్పక యతని చరిత దెలిసికొని మనమందరముపోయి చూడవలయును. అతడు మిగుల సుగుణవంతుడు అతని సుగుణసంపత్తి యంతయు నతడు వ్రాసిన యుత్తరములబట్టియే తేటమగుచున్నది. అతని సత్రము లీయూరిలో బెక్కుగలవని చెప్పుచున్నారు. సత్రాధిపతులకు దానిసంగతి తెలియకమానదు. వారి రప్పించి యడుగుదమని యూహించుచు నప్పుడే వారికి వర్తమానము చేసిరి. సత్రోద్యోగస్తులును సత్వరముగా నా సభకు వచ్చిరి. వారిం జూచి మీరున్న సత్రములెవ్వరివని యడుగగా నదృష్టదీపమహారాజు గారివని చెప్పిరి. అతండెందున్నవాడని మరల బ్రశ్న వేయ నదిమాత్రము మాకు దెలియదని యుత్తరము జెప్పిరి.

అట్లయిన మీకు విత్తమెవ్వరు పంపుచున్నారనగా మొదట నొక్కమారుగానే యెల్లకాలము సరిపడునట్లు వారి యుద్యోగస్థులు వచ్చియిచ్చిరని చెప్పిరి. ఆ మాటలు వినినతోడనే యారాజులందరు మిక్కిలి యద్భుతమందుచు వెండియు భూమి యొక్క పటమును దెప్పించి యందుగల దేశములన్నియు వేరువేర నిరూపించి చూచిరి కాని యమరావతీ రాజధానిగల దేశమెందును గనంబడినదికాదు. కానుకలు దెచ్చినప్పు డక్కింకరుల నతని నివాసము నడుగకపోయితిమే యని పశ్చాత్తాపపడుచు నతని వృత్తాంతము దెలియుటకై పెక్కుతెఱంగుల బ్రయత్నించుచుండిరి.

తరువాత వారందఱు విఫ ప్రయత్నులై యీసారి యదృష్టదీపు డెవ్వరికేని గానుకలు పంపినచో నా వచ్చిన భటులవెంట మన కింకరులంగూడ ననిపి యతని దేశము తెలిసికొనివచ్చునట్లు చేయుదమని నిశ్చయించుకొని తమ తమ దేశములకు బోయిరి. మరియు నొక్కనా డదృష్టదీపుడు పాండ్యదేశప్రభువగు మలయధ్వజమహారాజుగారికి బదివేలు గుర్రములు, నారువేల యుష్ట్రంబులు, రెండువేల యేనుగులు, లక్ష వెలజేయు రత్నహారములు, పదివేల వాహనంబులు మరియు జీనిచీనాంబరములు కానుకగా పంపినం జూచి యారాజు విభ్రాంతుండగుచు నోహో! యదృష్టదీపుడు నాకుం గానుకగా నిచ్చిన వాని మొత్తమునకు నాయైశ్వర్యము సరిగానుండునో లేదో ఇట్టివి నేనీ రాజుగారికి మరల నేమియంపుదును! అమ్మహాత్ముని యైశ్వర్య మేపాటి