పుట:కాశీమజిలీకథలు -02.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధర్మపాలుని కథ

167

నశ్వమును సిద్ధపరపింపుమని విజయకేతుని మొగము జూచి చెప్పెను. అతండది గ్రహించి రాజుబుద్ధి మరల్చినందులకు సునందాదేవిని మిక్కిలి మెచ్చుకొనుచు నపుడే యొక యుత్తమాశ్వమును జీను కట్టించి సిద్ధపరచెను.

రాజు మంత్రు లిద్దరిని దుర్వినీతుని వెంటరమ్మని యా హయమెక్కి కొంతవరకుఁ బురవీధులందిరిగి తరువాత దుర్వినీతుని గృహమెక్కడ యని యడిగెను. దాని కతఁడు భయపడుచుఁ దన యిల్లు చూపింపక వేరొక గృహము చూపెను. అప్పుడు రాజు విజయకేతుని మొగము చూచుటయు నతఁడది గ్రహించి దేవా! ఇది దుర్వినీతునిదికాదు. మఱియొకరిది. వెనుకఁ గొన్నిదినము లిందుండెను. కాని యిప్పుడు లేడు. వేరొకచోట గొప్పభవనము గట్టెను. చూపించెదరండని పలుకుచు నప్పుడే యా సేనానివేశమునకుఁ దీసికొనిపోయెను.

రెండవ కోటవలె నొప్పుచున్న యతని గేహము చూచి యారాజు విస్మయము జెందుచు విహారభద్రునిం జూచి కన్ను లెర్రజేయుచు నచ్చట గుఱ్ఱమును దిగి యాద్వారము దాపునకుఁ బోయి తలుపులు తీయించుమని దుర్వినీతునిఁ జూచి చెప్పెను. అప్పుడతండు తడబడుచు అయ్యా! దీని తాళముచెవి నాదగ్గర లేదు. దీనిలో నెవ్వరును లేరని చెప్పగాఁ గోపముచేయుచు నప్పుడే తాళము బడఁగొట్టించి తలుపులు తీయించెను. నాలుగైదువేలమంది యాయుధములla నుండిరి. వారింజూచి రాజు భయమును క్రోధమును సంభ్రమము మనంబున నావేశింప దుర్వినీతునిం గాంచి యీసైన్య మెవ్వరిదని యడుగఁగా నతండిది దేవరవారిదే యని చెప్పెను.

ఆ మాటవిని రాజు వెంటనే తలుపులు వేయించమని యాజ్ఞాపించెను. దుర్వినీతుఁడు అడ్డముగా నిలువంబడి లోపల వారికెద్దియో సంజ్ఞఁజేసెను. అప్పుడందులోని వారందరు నాయుధములు సవరించు కొనుచుండిరి. ఆ విధము దెలిసికొని విజయకేతుఁడు తొందరపడుచు నచటనున్న రాజభటులతో బలత్కారముగాఁ దలుపులు మూయుడని యాజ్ఞాపించగా విని వారును ద్వారములో నిలువబడియున్న దుర్వినీతునిఁ గూడ లోనికిఁ ద్రోసి తలుపులు మూసిరి.

అప్పుడు రాజు విహారభద్రునిఁజూచి దుర్వినీతుని యవినీతియంతయుం దెలిసినదా ! ఇదియంతయు నీకతంబున వచ్చినది. నిన్నేమి చేసినను ద్రోహములేదు. కానిమ్ము. ఇప్పుడు వచ్చిన యుపద్రవము దాటించుకొని తిరువాత నీ పని కనుగొనియెద నని పల్కుచు విజయకేతుం జూచి ఆర్యా ! మనసేనలన్నియు నెచ్చటనున్నవి! వేగము సన్నాహము సేయింపుము ఇప్పుడు తప్పక యుద్ధము జరుగఁగలదు. ఇది యంతయు చోళదేశపురాజు వసురక్షితుని కపటోపాయమని తోచుచున్నది అతఁడు మనకు సహజశత్రువు. మనలనెట్లయినను జయింప వలయునని కోరుచున్నాఁడు. ఇప్పుడు బలములు గూర్చుకొని వచ్చునని తోఁచుచున్నది. ఇందులోనివారు బైటికి