పుట:కాశీమజిలీకథలు -02.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

కాశీమజిలీకథలు - రెండవభాగము

ఈరీతి గ్రమక్రమముగా బ్రజలు భయము విడిచి దుర్వ్యాపారములకు దొడంగుచుండిరి. మందలించువారు లేమింజేసి బలవంతులల్పుల పసుక్షేత్రాదుల హరింప దొడంగిరి. దానంజేసి ప్రజల కొండొరులకు గలహము లధికమయినవి. నరు లాశ్రమధర్మముల విడిచి సంకరులై ప్రవర్తింపదొడంగిరి. ఆరీతి రాజ్యంబంతయు గ్రమక్రమంబున క్షీణదశకు వచ్చుచుండుట జూచి దుర్వినీతుడు మిగుల సంతసించుచు రహస్యముగా దనదేశమునుండి యుత్తరప్రత్యుత్తరములు దెప్పించుకొనుచుండెను. విజయకేతు డొకనా డారహస్యము దెలిసికొని యొక యుత్తరమును సంగ్రహించి రాజునకు జూపించి దుర్వినీతుని కుచ్చిత మంతయు దెలియజేసెను. కాని సురాపానమత్తుండగు నా రాజున కతనిబోధ యేమియు దలకెక్కినదికాదు.

దుర్వినీతు డాపట్టణములో నొకచోట స్థలము సంపాదించి దానిచుట్టును నున్నతమగు ప్రహరి పెట్టి రహస్యముగా దానిలోని సేనలం జేర్చుచుండెను. విజయకేతు డావృత్తాంతమునుఁ దెలిసికొని పట్టఁజాలక పట్టమహిషి సునంద కిట్లు వ్రాసెను. అమ్మా! నీపతి విహారభద్రుని బోధకు లోనై రాజతంత్రము లేమియుఁ జూచుటలేదు. రాష్ట్ర మంతయు భ్రష్టమై పోవుచున్నది. అదియుంగాక శత్రుపక్షపాతి యగు దుర్వినీతుని దెచ్చి యింటిఁలోబెట్టిరి. వాడు కుచ్చితపు వ్యాపారమున నుండి చోళదేశమునుండి సేనల రప్పించుచున్నాడు. ఎప్పుడో హఠాత్తుగాఁగోట బట్టుకొందురు రాజ్యహానియే కాక మానహాని గూఁడ గాగలదు. దుర్వినీతుడు చోళదేశపురాజు మంత్రి పుత్రుఁడు ఈ సంగతి నేనేమి చెప్పినను నీపతి వినిపించుకొనడు, నీవు పట్టమహిషిని గాన నీకుఁ దెలియపరచితిని ఇచ్చట నా మాట వినువారెవ్వరునులేరు. దుర్వినీతుని యిల్లు పరీక్షించినచో శత్రుసేనలు గనంబడును. రాబోవు ననర్దమునకుఁ బ్రతీకార మిప్పుడే చేయవలయునుగదా? నీవు గూడ నశ్రద్ధ చేసినచో శత్రువులువచ్చి పై బడుదురని వ్రాసి యాయుత్తరము దాసీజనమువలన నామె కందజేసెను. విద్యావతియు, రూపవతియు, గుణవతియునగు నాయువతి యాయుత్తరమునుఁ జదువుకొని విజయకేతుని సుగుణసంపత్తి నంతకుఁ బూర్వమేవినియున్నది కావున నతని వినయవిశ్వాసములకు సంతసించుచుఁ బ్రమత్తుండైయున్న ధర్మపాలున కారాత్రియంతయు నీతిబోధఁ జేసి యంతకుఁ బూర్వముకలిగిన దుర్బుద్ధియంతయుం బోగొట్టిఁ విహారభద్రునియం దసూయయు విజయకేతునందుఁ బ్రీతియుం గలుగునట్లు చేసినది.

అంత మరునాడుదయంబున నారాజు ఆహంకారముఖముతో సభకు వచ్చి మంత్రుల రప్పించి యిప్పుడు రాష్ట్రస్థితి యెట్లున్నదని యడుగగా విహారభద్రుఁడు పూర్వమువలెనే యెద్దియో చెప్పబోయెను. కాని వాని మాటలన్నియు ననర్థమూలములుగాఁ దోచినందున వినిపించుకొనక పట్టణమంతయుఁ జూడవలసి యున్నది. కావున