పుట:కాశీమజిలీకథలు -02.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధర్మపాలుని కథ

165

శత్రువు మిత్రుండగు నితండట్టి యూహతోడనే మనయొద్దకు వచ్చెను. వీడు పెక్కు విద్యలయందు బ్రవీణుడు. ద్యూతక్రీడయందును వేటయందును వీనికిగల పాటవము మఱియొకరికిలేదు. వీనికి మన యాస్థానములో దగిన యుద్యోగ మిప్పించవలయును. వీడుండినచో శత్రువులు భయపడుచుందురని యెన్నియో బోధించుచున్న విహారభద్రుని మాటలు విని సైరింపలేక రెండవ మంత్రియగు విజయకేతుం డిట్లనియె. నరేంద్రా! నన్ను మీ రేయాలోచనయు నడుగకున్నను నాకు దివాణము మీదగల విశ్వాస మూరకొననీయక చెప్పుచెప్పుమని యూరక ప్రేరేపించుచున్నది. వినుండు. వీడు మనకు సహజశత్రువగు చోళదేశపు రాజుగారి మంత్రిపుత్రుడు అట్టివాని బరీక్షింపక గోటలోనికి రానీయవచ్చునా? వీడు మనకోటగుట్టు దెలిసికొనుటకయి వచ్చి యుండవచ్చును. ఉద్యోగపు నెపమున, గొన్నిదినము లుండి రహస్మములన్నియు దెలిసికొని వెళ్ళినచో మనమేమిచేయగలము? మీకు నామాట లేమియు హితముగా నుండవు. నీతిమాట దలపెట్టవలసిన బనిలేదుగదా! నీతిశాస్త్రములో శత్రుపక్షపువాడు వచ్చినపుడు వానింబట్టుకొని బందీగృహమున నుంచవలయునని యున్నది. మీ పెద్దమంత్రి యట్టితంత్రమున కొడంబడునా? నేను జెప్పవలసినమాట జెప్పితిని. తరువాత మీ యిష్టము వీనిని మాత్రము నమ్మి విడిచిపెట్టగూడదని ముమ్మారు పలికెను.

అప్పుడు విహారభద్రుడు పకపక నవ్వుచు నోహో! ఈతండు రాజునకు క్షేమముగోరువాడును మేమందరము కోరనివారము కాబోలు. ఇక వీనిబుద్ధిబలము కొనియాడతగినదే! నేను జేయబూనినపని కాదనుట వీనికి సహజము. కానిమ్ము దాన నాకు జెడిపోవునది యేమియున్నది. మనగుట్టు దెలిసికొనుటకు నీతడు రావలయునా? కోట ముట్టడించునప్పుడు మనగట్టు నిలుచును కాబోలు. ఈ దుర్మంత్రములతో బ్రయోజనములేదు. వీనిని మనయొద్ద నుంచుకొనకతప్పదు. నే నభయహస్త మిచ్చితిని. వీనివలన మనకు శత్రువుల మర్మములు దెలియవచ్చును. అని నిర్భయముగా బలుకుచున్న పెద్దమంత్రిమాటలు కాదనలేక యాధాత్రీపతి యందులకు సమ్మతించినట్లు సూచించుచు నంతఃపురమునకు బోయెను.

అప్పుడు విహారభద్రుడు విజయకేతు నాక్షేపించుచు దుర్వినీతుని దనకు సహాయుడుగా నుండునట్టి యుద్యోగమిచ్చునట్లు వ్రాసెను. దుర్వినీతుడును క్రమంబున నయ్యాస్థానములో నగ్రేసరుడయి రాజుతో సప్తవ్యసనములును మిక్కిలి యుత్తమములని చెప్పి యతని చిత్తమును దదాయత్తమగునట్లు చేసెను. రాజు దుర్వృత్తి కుద్యోగించుచుండ రాష్ట్రంబున ద్యూతక్రీడ లధికమైనవి. చౌర్యము తన్మూలక మగుటచే దానిమాట జెప్పనేల? పానగోష్టి యన్నిటికిని మొదటిదే కదా! కామప్రవృత్తి లోకమునకు స్వభావసిద్ధమయినదే.