పుట:కాశీమజిలీకథలు -02.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

కాశీమజిలీకథలు - రెండవభాగము

భద్రుడు సంతతము రాజున కాబోధయే చేయుచు గ్రమంబున నతని చిత్తము నిజాయుత్తముగా జేసికొనియెను.

క్రమక్రమముగా ధర్మపాలుడు విహారభద్రుని యాలోచనకు లోనయి రాజకీయవ్యవహారములన్నియు నతనిమీద వేయించి విజయకేతుని నించుకేనియు మన్నింపక తాను సంతతము నంతఃపురమున గాంతోపభోగములతో గాలక్షేపము చేయుచుండెను. అవ్విధమంతయు గ్రహించి విజయకేతు డొకనా డాత్మగతంబున నిట్లు తలంచె. ఆహా! యీరాజు మిగుల మూర్ఖుడయి వీని మాటలచే జెడిపోవుచున్నవాడు ఈరాజు చేష్టలుచూడ బూర్వమురీతిని గనంబడుటలేదు. పూర్వమువలె నాతో నవ్వుచు మాట్లాడడు. కన్నెత్తిచూడడు. నాతో రహస్యములు జెప్పుట మానివేసెను. మంచిపనులకు నన్ను నియోగింపక నీచకార్యములకు బంపుచున్నవాడు. నా కుశల మేమియు దెలిసికొనడు నాపన్నులయినవారిని మన్నించుటలేదు. నా శత్రువులయెడ విశ్వాసము జూపుచుండెను. నామాటకు బ్రత్యుత్తరమయిన నీయడు. నేను దాపుననున్నను మఱి యొకరితో వేఱొకరిని నిందించును. ఇదియంతయు విహారభద్రుని యుపదేశమహిమయే గదా ఆహా! చిత్తజ్ఞానాను వర్తులగువార నర్థులయినను రాజులకు బ్రియులగుదురు. సమర్ధులయినను దద్భావబహిష్కృతులయినచో ద్వేషులగుదురుగదా.

శ్లో॥ సులభాఃపురుషాలోకే సతతం ప్రియవాదినః।
     అప్రియస్య పథ్యస్యవ్యక్తాశ్రోతాచ దుర్లభః॥

అనినట్లు ప్రియవాదులనేకులు గలరు గాని యప్రియమును నపథ్యమునగు వాక్యములను జెప్పువాడును వినువాడును గూడలేడు. ఈతని రాజ్యము స్వల్పకాలములోనే శత్రువుల యధీనము కాగలదు. నేనేమి జేయువాడ. చిరకాలము నుండి యాశ్రయించియున్న యీ దివాణమును విడిచిపోవుటకు మనసొప్పకున్నది. కానిమ్ము నేనేమి నోరు మెదల్పక మూగవానివలె నెట్లో కాలము వెళ్ళించెదనని యూహించి యారీతినే నడుచుకొనుచుండెను.

అట్లు ధర్మపాలుడు కామతంత్రుడై రాజ్యమును దుర్మంత్రి యధీనముచేసి సంతతము నంతఃపురమందే వసింపుచుండ నొకనాడు చోళదేశపు రాజుయొక్క మంత్రిపుత్రుడు దుర్వినీతుడను వాడు గూఢపురుషులతో గూడికొని కౌశాంబికివచ్చి మిక్కిలి విచిత్రములగు గ్రీడలచేత విహారభద్రుని వశము చేసికొనెను. ఒకనాడా దుర్వినీతుని వెంటబెట్టుకుని విహారభద్రుడు రాజసభకువచ్చి రాజునకు వానిం జూపుచు నిట్లనియె. దేవా! ఈతడు చోళదేశపు రాజుయొక్క మంత్రి చంద్రపాలితుడనువాని కుమారుడు, దుర్వినీతుడనువాడు వీడు మిగుల శూరుడు. రాజుతో ద్వేషించి యెచ్చటనైన గొలువుచేయుటకు వచ్చినాడు మనకారాజు సహజశత్రుడుగదా! శత్రువునకు