పుట:కాశీమజిలీకథలు -02.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధర్మపాలుని కథ

163

యును. అష్టమమున బరాక్రమచింత ఈరీతి పగలు వెళ్ళించదగినది. మఱల రాత్రి ప్రథమభాగంబున సంధ్యోపాసనయు గూడపురుషనియోగము ద్వితీయభాగమున శ్రోత్రియుడువోలె భోజనానంతరము స్వాధ్యాయనము జదువవలయునట తృతీయము దూర్యఘోషములచే గడుపవలయును. చతుర్థదపంచమభాగముల నిద్ర తిరుగా షష్టభాగంబున లేచి శాస్త్రచింతయు గార్యచింతయు జేయవలయును. సప్తమమున దూతాదిప్రేషణము. అష్టమమున బురోహితాదివిప్రబృందము దయచేసి స్వప్నఫలముల జెప్పుచు హోమము దానము తర్పణము చేయవలయును. దీనికంతయు బంగారమే కావలయును. బ్రాహ్మణులనగా బ్రహ్మకల్పులు వీరికి దానమిచ్చినచో నైశ్వర్యములు వృద్ధియగును. ఇంతకు మున్నెచ్చటను దానముపట్టనివారు పుత్రవంతులు వీరికిచ్చిన సకలారిష్టములు నశించునని యిట్లుపలుకుచు గష్టపెట్టుదురు.

ఈరీతి రాత్రింబగళ్ళు వెళ్ళించువానికి సుఖము లేశమైనను గలుగునా! వాడు రాష్ట్రము నేమి రక్షించుకొనును. దండనీతియందు జెప్పినరీతి యిది. ఇట్టి శాస్త్రము ననుసరించినంగాని సంపదలు నిలువవట అది వట్టి ప్రల్లదము. లోకమువలననే యనుభవము తెలిసికొనదగినదిగాని శాస్త్రప్రయోగములేదు. శిశువు సహితము తల్లియొక్క లాలనచేత నుపాయముగా బాలు గుడుచుకొనుచుండును. కావున యథేష్టముగా నింద్రియసుఖముల ననుభవింపదగినదే. విషయాభిలాషల జయింపదగినది. అరిషడ్వర్గము విడువవలయును. సుఖమందిచ్చ యుండకూడదు అని యుపదేశించెడి పండితులు గూడ దివాణములలో దొంగిలించిన ధనమంతయు వేశ్యలపాలు జేయుచున్నారు. వీరి మాటయేల! పరాశర ప్రభృతులు మాత్రము విషయాభిలాష విడిచిరా! శాస్త్రప్రకారము వారుమాత్రము నడచిరా? సుఖదుఃఖములు వారికి మాత్రము తప్పినవియా! కావున దీనిలో నేమియునులేదు. రాజా! నీవిట్టి డాంబికపు మాటలు నమ్మకుము. ఉత్తమజాతిని బుట్టితివి. తొలిప్రాయమున సుందరశరీరము నపరిమితైశ్వర్యము గలిగి యుంటివి. ఈ వెర్రిమాటల నమ్మి విద్యాగ్రహణప్రయాసమునకు బోకుము. నీకోశగృహములోనున్న ధనము మూడుతరములదాక సరిపడును. పెక్కేల రాజ్యభారమంతయు సమర్దుడగు వానియందు బెట్టి యచ్చరలంబోలియున్న శుద్ధాంతకాంతలతోఁ గ్రీడింపుచు సంగీతపానగోష్టివిశేషముల శరీరలాభమును సార్ధకమును జేసికొనుము అని బోధించెను

ఇట్లు మంత్రులిద్దరు నుపన్యసించిన విని యారాజు శిరఃకంపపూర్వకముగా నవ్వుచు నోహో! మీరిరువురు హితోపదేశము చేయుటచే గురువులయిరి. మీ యుపన్యాసము శ్రవణానుకూలముగానే యున్నది. అని చెప్పుచు లేచి అంతటితో సభ జాలించి యంతఃపురమునకు బోయెను. తరువాత గపటక్రియాదక్షుడయిన విహార