పుట:కాశీమజిలీకథలు -02.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

కాశీమజిలీకథలు - రెండవభాగము

రాజునుగూడ జెరుచును. కావున నాగమదీపమునజూచి నడిచిరేని లోకయాత్ర సుఖముగా జరుగును. త్రికాలచర్యలం దెలిసికొనుటకు శాస్త్రచక్షుస్సు దివ్యమైనది కదా? విశాలమగునేత్రములు గలిగియున్నను అదిలేనివా డర్దదర్శనముల గ్రుడ్డివాడేయగును. కావున బాహ్యవిద్యావ్యాసంగము విడిచి రాజు కులవిద్యయైన దండనీతి నభ్యసింపవలయు. దానంచేసి మిక్కిలి ఖ్యాతిగలిగి సంకల్పసిద్ధుడై ప్రజల వశపరచుకొని సుఖముగా రాజ్యము సేయును. ఇదియే దండనీతివలన గలుగులాభమని విజయకేతుడు చెప్పగా విని రాజు సంతసించుచు దరువాత విహారభద్రుని మొగము జూచెను.

అప్పుడు సకలతంత్రదుర్నయోపాధ్యాయుడగు విహారభద్రుడు లేచి రాజుగారికి మ్రొక్కుచు దేవా! మదీయవిజ్ఞాపనముగూడ నవధరింపుడు. లోకములో దైవానుగ్రహమువలన నెద్దియేని యైశ్వర్యము గలిగినచో ధూర్తులు దాంబికవచనములచే బ్రభువుల భ్రమపెట్టి స్వప్రయోజకత్వమును వెల్లడిచేసికొనుచున్నారు. మరికొందరు యోగులమని శిఖాయజ్ఞోపవీతముల దీసి యనశనవ్రతము బూనితిమని చెప్పుచు నాశాపాశమునుమాత్రము విడువలేక సర్వస్వమును స్వీకరింతురు. కొందరు అల్పులనైనను జక్రవర్తిని జేయుదుమనియు కొందరు శస్త్రములేకనే శత్రువుల సంహరింతుమనియు నీ రీతి ననేకవిధముల డాంబికములబన్ని రాజుల నమ్మించి వారు చెప్పినట్లు చేయించుచుందురు.

ఇప్పుడు విజయకేతుడు చెప్పినదండనీతి యట్టివారు చెప్పినదే. అందలి విషయములను సంక్షేపముగా జెప్పెద వినుడు త్రయీవార్తాఅన్వీక్షకీ దండనీతి అను నామములచే రాజ్యవిద్య నాలుగువిధములుగా జెప్పబడియున్నది. అందు ద్రయి వార్తాన్వీక్షకులు మూడును గొప్పవి వానివార్తలటుండనిండు. నాలుగవది యగు దండనీతిని విష్ణుగుప్తుండు సంక్షేపముజేసి యారువేల శ్లోకములుగా రచించెను. అట్టిదాని నధ్యయనము చేయుమనిగదా వీరియభిప్రాయము. అలాగుననే చదువుదము. దానికొఱకు శబ్దశాస్త్రముగూడ జదువవలయును. ఇదియంతయు బూర్తియగువరకు ముదిమియేవచ్చును. మరి సుఖపడుట యెన్నడు?

మరియు రాజకుమారు డుదయంబున లేచి దంతధావనము చేసికొని ప్రథమభాగంబున న్యాయవ్యయంబులం దెలిసికొనదగినది ద్వితీయభాగంబున నన్యోన్యము గలహించెడి ప్రజల పరుషవచనములచే దర్ణముల బాధింపవలయును. తృతీయభాగంబున వీరభటుల దిగ్విజయయాత్రావిశేషములు వినవలయును. మరియు స్నానభోజనాది వ్యాపారములచే ముగియునుగదా! చతుర్ధంబున నర్ధగ్రహణమునను బంచమమున మంత్రిచింతచేతను మహాయాన మనుభవింపవలయును. షష్టభాగమున మంత్రియైనను విహారమైన జేయదగినది సప్తమమున జతురంగబలప్రత్యవేక్షణాయాసము జెందవల