పుట:కాశీమజిలీకథలు -02.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్రుని కథ

161

మంటపములో నిరువుర బురుషుల నినుపగొలుసులతో దలక్రిందుగా వ్రేలగట్టిరి. వారు చచ్చిరికదా వారిశరీరములు చెడక చిరకాలమట్లె యున్నవెట్లు? అది దుర్జనులకు బుద్ధివచ్చు పనియట ఈ దినమున నేనుజూచు విశేషములలో నదిమిక్కిలి యబ్బురము గలుగజేయుచున్నది. వారెవ్వరు? ఏమితప్పు జేసిరి? ఈవృత్తాంతము ముందుగ జెప్పకతప్పదు. నాయందు గోపము సేయకుడు ఈకథ వినినతరువాతగాని నాకు భోజనము రుచింపదని పాదంబులపైబడి యెక్కుడు దీనత్వముతో వేడుకొనుటయు నయ్యతిపుంగవుండు నవ్వుచు నిట్లనియె.

నీవు జాగుచేసినప్పుడే యెద్దియో గొడవతో వచ్చెద వనుకొంటిని. దాని వృత్తాంతము చెప్పెదనులే నే నెక్కడికి బోవను. భోజనము చేయుము. సావకాశముగా జెప్పెదనని పలికి యెట్టకేలకు వాని నొప్పించి భోజనానంతరము నొకచోట సావధానముగా గూర్చుండి యమ్మాణిక్యప్రభావంబున దద్వృత్తాంత మంతయు గరతలామలకముగా దెలిసికొని యిట్లని చెప్పదొడంగెను.

ధర్మపాలుని కథ

తొల్లి మాళవదేశంబున ధర్మపాలుండనురాజు విహారభద్రుడు విజయకేతుడను మంత్రులతో గూడి కౌశాంబియనుపట్టణము రాజధానిగా జేసికొని ధర్మంబున రాజ్యము సేయుచుండెను. అతనిపత్ని సునంద. ఆసుందరియు బతియెడ భయభక్తివినయవిశ్వాసములు గలిగి సతీధర్మ మించుకేనియు దప్పక వల్లభునకు శుశ్రూష జేయుచుండెను. అత డొకనాడు పేరోలగంబుండి మంత్రుల నిరువురంజూచి రాజులకు దండనీతి నెరింగిన గలుగులాభ మేమని యడిగిన నందు ముందు రెండవ మంత్రియైన విజయకేతుడు లేచి నమస్కరించుచు దనకు ప్రభువునందుగల వినయవిశ్వాసములు తేటబడునట్లు యుక్తియుక్తముగా నిట్లనియె.

దేవా! అగ్నిశోధితముగాక హేమము ప్రకాశించనట్లు నీతిపాటవము లేనివాని బుద్ధిబల మనామకమై యుండును. బుద్ధిబలములేనివా డెంత యున్నతుడైనను పర్వతమువలె దనబై కెక్కినవారి నైనను గుర్తెరుఁగకుండును సాధ్యసాధనముల విభజించి నడచుటకు సమర్థుడు కానేరడు. నియమములేక వ్యాపారముల జక్కజేసుకొనలేనివాని బరులు స్వీయులుగూడ నవమానింతురు. అదియునుంగాక నతనియాజ్ఞకులోనై ప్రజలు వర్తింపరు. అతిక్రాంతశాసనులగుప్రజలు స్వేచ్ఛావిహారులై సర్వవ్యాపారముల యందు సంకరులగుదురు. నిర్మర్యాదమైనలోక ముభయలోకముల దాను జెడుటయేకాక