పుట:కాశీమజిలీకథలు -02.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

160

కాశీమజిలీకథలు - రెండవభాగము

కాశీమజిలీ కథలు

రెండవ భాగము

17వ మజిలీ

పదియేడవ మజిలీ ప్రదేశము గొప్పపట్టణము అందు విశాలముగానున్న సత్రంబున బసజేసిరి. స్వాములవారు స్నానముచేసి జపముజేసికొనుచున్న సమయమునందు శౌనకుడు పురవిశేషముల చూచు తాత్పర్యముతో నంగడికి బోయెను. ఆ విపణి మార్గము మిక్కిలి విశాలముగను రమ్యవస్తువులు గలదిగా నుండుటచే నచ్చటివింతలం జూచి క్రమక్రమముగా దూరముగా బోవుచుండెను. పోవంబోవ బట్టణపుకోట గనంబడనది. అది మిక్కిలి యెత్తుగాను బొడవుగా నుండుటచే దానిచుట్టు తిరిగిరా దలంపుతో బోయిన పెద్దతడవు పట్టినది. మరియుం గోటముఖమునకు బోయినంత నచ్చటి వింతలన్నియు నతని స్వాంతమున కచ్చెరువు గలుగజేసినవి.

మరియొకచోట మంటపములో నడ్డముగావై చిన దూలమున దలక్రిందుగా నిరువుర నినుపగొలుసులతో వ్రేలగట్టియుంచిరి. వారినట్లుకట్టి చిరకాలమైనను జీవించిన మనుష్యులవలె నున్నారు. ఆప్రక్కనున్న శిలమీద “దుర్జనులకు బుద్ధివచ్చుపని" యని వ్రాయంబడియున్నది. ఆవిశేషముజూచి శౌనకుడు అచ్చటనున్నవారిని వ్రేలంగట్టిన పురుషులెవ్వరనియు నేమితప్పుచేసిరనియు నడిగెను. కాని యెవ్వరును చెప్పినవారు లేకపోయిరి.

ఆవింత పలుమారు పరిశోధించి వాడు కడువేగముగా సత్రమునకుబోయి భోజనముచేసి తనరాక నిరీక్షించియున్న మణిసిద్ధునిగాంచి నమస్కరించి యెదుర నిలువబడినంత నయ్యతి కోపమిశ్రితమైన స్మితముతో నిట్లనియె. గోపా! నీకింతభయము లేకపోయినదేమి! నీకొఱ కెంతసేపు కాచియుందును. ఎచ్చటికి బోయితివి? భోజనము మాట మరచిపోయితివా యేమి! యెద్దియో యొకగొడవ బెట్టుకొని తిరుగుచుందువు. ఈ దినం బెద్దియేని వింత గనంబడినదికాదా చాలు లేలెమ్ము అని పలుకగా వాడు నించుక సిగ్గుతో నవ్వుతో నిట్లనియె.

స్వామీ! నేను భోజనముకొరకు మీవెంట రాలేదు. దేశవిశేషము లరయు తలంపుతోగదా వచ్చితిని. మరి వానింజూడ బోవక యేమిచేయుదును? ఈపట్టణము మిక్కిలి పెద్దదిసుండి. అంగడిలో నెన్నివిశేషములు చూచితి ననుకొంటిరి. ఇందున్న కోటలో దులయగు దాని నిదివరకు మనము చూచియుండలేదు. ఆకోటముందర