పుట:కాశీమజిలీకథలు -02.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్రుని కథ

159

లేఖను దిలోత్తమను గాంధర్వవివాహంబున భార్యలగా స్వీకరించి రుచికుండు తొలుత నోడనెక్కి వారందరితో రామచంద్రపురనగరమునకు పోయి పుత్రికావియోగచింతాకులస్వాంతుడగు శూరసేనమహారాజునకు దమరాకంజెప్పి ముప్పురిగొను సంతోషముతో గొన్నిదినము లందుండెను. అందు పూవుబోడి చంద్రలేఖం గలసికొని మిగుల నాదరించినది.

శూరసేనుడు పుత్రహీనుడు కావున దనరాజ్యమునకు రుచికునే యధీశ్వరునిగా జేసి పట్టముగట్టెను. రుచికుండు తనకు రాజ్యమువచ్చిన తక్షణము గౌతమునికి మంత్రిత్వాధికారమిచ్చి యతనికిగూడ యొక చక్కనికన్యం బెండ్లిజేయించెను రుచికుడు స్వర్గమునుండి తెచ్చిన సంగీతవృక్షబీజమును శ్రీజగన్నాథములో స్వామిగుడి యావరణలో బాతింపవలయునని యుత్సాహము గలిగి యొకనాడు యిరువురుభార్యలు గౌతముడు సేవింప జతురంగబలముతో వెడలి జగన్నాధమునకు బోవుచు నొకనాటిరాత్రి నిన్న నీవు చూచినచోట బసజేసిరి.

మరునాడు బయలువెడల సమయములో గానవృక్షబీజము మిక్కిలి సూక్ష్మమైనది గనుక పెట్టెలో సవరించబోయిన చేయిజారి నేల బడినది. తరువాత దానికొరకు నెన్నియో ప్రయత్నములు చేసి వెదకిరిగాని కనంబడినదికాదు. బుద్ధిమంతుడయిన రుచికు డప్పు డాభూమి యంతయు నీరుచల్లించి దానికిజేయవలసిన దోహదము జేయించెను. అప్పుడది మొలకెత్తి క్రమముగా బెరిగి వృక్షమయినది. రుచికు డక్కడనే మంచిసౌధములుగట్టించి సంవత్సరమున కారుమాసము లిరువురుభార్యలతో వచ్చి యచ్చట నివసించి క్రీడించువాడు అతడు పెద్దకాలము పుడమి పాలించెను.

గోపా! నీకు వినంబడినగాన మాసంగీతవృక్షమువలనం జనించినది. నీవు మిగులపుణ్యాత్ముడవు కావున నీకా గీతము వినంబడినది. యొరుల కాపాట యేమాత్రము వినబడదు. అత్తరు వితరులకు జూడ గంటకద్రుమమువలె దోచును. ఆవృక్షము నాటి నేటికి పెక్కు సంవత్సరములయినది. దానివృత్తాంత మెఱింగినవా రెవ్వరు నిప్పుడు లేరు. మణిమహిమచే నాకు దెలినయ్యె నీకథయు బుణ్యప్రదమయినదే. వినినవారికి నభీష్టసిద్ధియగు ఇప్పుడు నీసంశయము తీరినదా? యని జెప్పిన విని యాగోపకుమారుడు సంతసించుచు నయ్యా! మీయక్కటికము నాయందు బరిపూర్ణముగా నుండినప్పుడు నన్ను దురితములంటునా! ఈకథ నాకు మిగల సంతోషము గలుగజేసినదని పలికెను. పిమ్మట భుజించి గొంత విశ్రమించి గోపాలుండు గావడి యెత్తుకొని దోడరా నచ్చట గదలి క్రమంబున నగ్గురుశిష్యులు దరువాయి మజిలీ జేరిరి.