పుట:కాశీమజిలీకథలు -02.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

158

కాశీమజిలీకథలు - రెండవభాగము

వాడును కన్నుల నానందబాష్పములుగార నన్ను బెద్దతడవు గాఢాలింగనము చేసికొనియెను. ఇట్లు కొంతసేపు మేమిరువురము నన్యోన్యదర్శనసంజాతకౌతూహలంబున మేనులు మరిచి కంఠంబులు డగ్గుతికవార నెట్టకేలకు సన్ననియెలుంగున గుశలప్రశ్నములు వేసికొంటిమి. మేము విడిచిపోయినది మొదలు నాటివరకు జరిగిన కథలన్నియు నొండొరులకు చెప్పుకొని యప్పుడే యచ్చటనుండి బయలువెడలి మా దేశమునకు బోవుచు నీయూరు జేరితిమి. తరువాతకథ నీమె యెరిగినదేకదా? ఇదియే నావృత్తాంతము దైవకృత్యమువలన ప్రాణతుల్యులైన మిమ్ము నందర నిచ్చటం గంటి నని పలుకగా విని యందరు నాశ్చర్యపారావారవీచికలం దేలుచు రుచికుని యదృష్టమును వేతెఱగుల బొగడదొడంగిరి.

అప్పుడు చంద్రలేఖయు వానిం జూచి ఆర్యా! చెఱకుదినిన నోటికి బెండు రుచింపనటుల దేవకాంతారతిసౌఖ్యంబు లనుభవించిన నీకు మాయందేమి మక్కువ యుండును? నీకొరకు మేమూరక పెక్కిడుములం గుడిచితిమి. ఆ తిలోత్తమ నిచ్చట నుండనీయదు. ఎప్పుడో మరల స్వర్గమునకు దీసికొనిపోవునని తోచుచున్నది. నీయభిప్రాయ మెట్లుండెను జెప్పుమని యడుగుటయు దానిం రుచికుం డోదార్చుచు నిట్లనియె.

బోటీ! నీవెప్పుడు నట్లు తలంపకుము. మీరు రూపంబున దేవకాంతలను మించినవారు. మనుష్యులకు మానవకాంతలు భార్యలైన యుక్తముగా నుండును. తిలోత్తమ నన్నెప్పుడు స్వర్గమునకు దీసికొనిపోవదు. ఆచర్య గతించిపోయినది. స్వర్గమునకు పోవుట సామాన్య మనుకొంటివా యేమి? అప్పుడు యుద్ధసమయముగనుక నిరాటంకముగా దిరిగితిమి. కాని యితరసమయములయందు. నింద్రుని యనుమతిలేక గాలియైనం గదలటకు వీలులేదు. ఇక మిమ్ముల విడువనని ప్రమాణము చేయుచున్నవాడ. మీరు నాకై పడినబాధలం దలచుకొనిన మిగుల దుఃఖమగుచున్నది అని పలుకుచు వారి నిరువురను వేరువేర నక్కున జేర్చుకొని మన్నించుచు వారుపొందిన దుఃఖమును పోగొట్టెను. తరువాత విజ్ఞానయోగిగానున్న తనతండ్రి నచ్చటికి రప్పించుకొని యతనికి దనవృత్తాంతమంతయుంజెప్పి యింతింతనరాని యానందము గలుగజేసెను. పిమ్మట జంద్రలేఖయు రుక్మాంగదునికి నతనివృత్తాంతము దెలుపుచు నతండాశ్చర్య బడుచుండ దాను ధరించెడు దుస్తులు చూపించి నమ్మకము కలుగజేసినది.

రుక్మాంగదును వారినందరిని తనదేశములో నుండుమని యెంతయో బ్రతిమాలికొనియెను కాని రుచికుండు తండ్రియాజ్ఞవలన దనజన్మభూమియగు జగన్నాథముననే యుండుటకు నిశ్చయించుకొనెను అంత రుక్మాంగదుడు వారికందరికి దగు బహుమతులుజేసి చంద్రలేఖకు బుత్రికకుంబోలె కొన్ని గ్రామంబు లరణముగా నిచ్చి మచ్చికతో నప్పుడప్పు డచ్చటికి వచ్చున ట్లొడబరచి యనురాగపూర్వకముగా బంపెను. చంద్ర