పుట:కాశీమజిలీకథలు -02.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

కాశీమజిలీకథలు - రెండవభాగము

బునం జేసి పలుదెరంగుల ధ్యానించి నార్తరక్షాదక్షుండగు నాపుండరీకాక్షుండు మరల స్వప్నములో గనంబడి తరువాత నాచరించవలసిన కృత్యము లన్నియు బోధించి యంతిర్హితుండయ్యెను.

మరునాడు లేచి మజ్జనకుడు మురియుచు నాదరికివచ్చి వత్సా! నీయభీష్టము స్వల్పకాలములో నెరవేరును. కొన్నిదినములలో రక్తాక్షుండను రాక్షసుండు స్వర్గమును ముట్టడించి సహస్రాక్షు నక్షీణబలంబునబట్టి చెరగొనిపోవును. అప్పుడు స్వామి గుడి వెనుక కొక విమానమువచ్చునట. నీవు నీభార్యతో దానిమీద నెక్కిన స్వర్గమునకు బోగలవు. దానంజేసి అచ్చటివిశేషములన్నియుం జూడగలుగునట. ఈలాగున రాత్రి నాకు స్వప్నంబున హరి యానతిచ్చెను. కావున నీవు సంతోషముగా నుండుమని నాకు బోధించెను.

నేను నట్టి అవసరమువేచియుండ అతడు చెప్పిన సమయమునకు నాగుడి యొద్దకు విమానము వచ్చినది నేను దిలోత్తమతో గూడ నద్దేవయాన మెక్కితిని. అదియు దృటికాలములో స్వర్గమునకు దీసికొనిపోయినది. మాతండ్రి చెప్పిన ప్రకారము మేము మొదట నందనవనములో గొంత సేపు గ్రీడించితిమి. అప్పుడెవ్వరో కొందరు కాంతలువచ్చి తిలోత్తమా! యీతండెవ్వడేయని నా భార్య నడిగిరి అదియు నవ్వుచు నీతడొక పుణ్యపురుషుడని యుత్తరము చెప్పి నా మొగముజూడ నేను దానితో వాల్గంటీ! నీవు తిలోత్తమ యంశంబున బుట్టితివి. నీకును దానికిని నామరూపంబుల నించుకయు భేదము లేదని దోచుచున్నయది నిన్నా తిలోత్తమవే యనుకొని యిట్లడిగిరి. కానిమ్ము దీన నీకు గొరతయేమి? సంశయింపక నీవును తగినట్లుత్తరము చెప్పితివి. భళిభళి! యని పలుకుచు గొంతసేపా చిలుకలకొలికితో నవ్వనములో విహరించితిని.

మేమీయూర జూడవలసిన విశేషములన్నియు భగవద్వచన ప్రకారము మా తండ్రి నాకు బోధించియున్న వాడు కావున తరువాత అత్తోటలోనుండి పట్టణములోనికి వచ్చితిమి. అప్పుడు పట్టణమంతయు జనశూన్యముగా నున్నది. నిరాటంకముగా నలుమూలలు గ్రుమ్మరి మాతండ్రి చెప్పినరీతి అతిప్రయత్నముతో వెదకి సుధర్మయొక్క గుప్తద్వారము గనుగొని అక్కీలుద్రిప్పిన దలుపువచ్చినది. అప్పుడచ్చట నెవ్వరును లేరు. మే మామార్గమున లోనికిబోయి అచ్చటి విశేషములన్నియుం జూచి మరల నా దారినే బైటికి వచ్చితిమి.

నా వెనుకవచ్చుచున్న తిలోత్తమను ద్వారములో నెవ్వడో నిలిపి యీ యూరనున్న తిలోత్తమే అసుకొని యెట్లు లోపలను బోయితివని యడిగెనట. అదియు వానికి దగినట్లె యుత్తరము చెప్పి నాయొద్దకు వచ్చినది. పిమ్మట మేమిరువురము కొంత సేపు స్వర్గములో విహరించి అటు పైన మరల నా విమానమెక్కి భూలోకమునకు