పుట:కాశీమజిలీకథలు -02.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్రుని కథ

153

పిమ్మట మాతండ్రి తాను జెప్పియు నొకరిచేత జెప్పించియు నెన్నియో ప్రయత్నములు సేసెనుగాని నాయుద్యమము మాన్పింప లేకపోయెను. లోకములో బుత్రులంగాంచుట వంశము నిలుచుటకు గదా! వీడు వివాహమాడనినాడు మదీయ వంశాంతమగు నేనేమి చేయుదు. వీ డెవ్వరు చెప్పినను వినకున్నవాడని పెక్కుగతుల జింతించుచు నొక్కనా డంతఃకరణంబున దన యిష్టదైవమగు జగన్నాథస్వామిని ధ్యానించి నిద్రవోయెను. భక్తపరాయణుడగు నారాయణుండతని స్వప్నములో సాక్షాత్కరించి బలదేవా! నీవు చింతింపకుము, నీకుమారుని యభీష్టమును దీర్చెదను. రామచంద్రనగరములో దిలోత్తమయంశంబున దిలోత్తమయను రాజపుత్రిక పెరుగుచున్నది. దానిం బెండ్లి జేయుము తన్మూలముగా నతండు స్వర్గసౌఖ్యమనుభవింపగలడు. నీవు కోరినంత నీపుత్రున కా ధాత్రీపతి తనపుత్రికనిచ్చి వివాహము గావించును. నీ వంశము మిగుల ఖ్యాతికి రాగలదని బోధించి యంతర్ధానము నొందెను.

మా తండ్రియు నిద్రమేల్కొని మేల్కలగనినందులకు సంతసించుచు నన్ను జేరి తనస్వప్నవృత్తాంత మంతయుం జెప్పెను. స్వప్న మందైన నసత్యమాడని మాతండ్రి మాట నేన నమ్మి యుత్సాహముతో నత్తిలోత్తమం బెండ్లియాడుటకు సమ్మతించితిని. వెంటనే యతడా రాజునొద్దకు బోయి ప్రార్ధించిన సమ్మతించి శీఘ్రకాలములో నాకన్యకనిచ్చి వివాహము చేసెను. ఆ కాంతయు సాముద్రిక శాస్త్రలక్షణంబుల నేకొరంతయులేక నాయభీష్ట ప్రకారము చక్కదనము గలిగియున్నది. కావున నేను మిక్కిలి సంతసింపుచు జగన్నాథస్వామిని బెక్కుగతుల వినుతింపుచు నాయింతితో గొన్ని దినము లిప్టోపభోగముల గాలముగడిపితిని.

అంత నొక్కనాడు నేను స్వర్లోకదిదృక్షా కౌతుకంబుమనంబున దీపింప మాతండ్రితో నిట్లంటి. తండ్రీ! నీవు నాతో మొదట స్వర్గసౌఖ్యములు నీకు ముందు గలుగును. తిలోత్తమం బెండ్లియాడుము. ఈరీతి స్వామి యానతిచ్చెనని నాకు బెండ్లి చేసితివి. స్వామిమాట యసత్యమైనట్లు తోచుచున్నది. స్వర్గవిశేషములు నాకిప్పటి కేమియుం దెలియలేదు. ఇక నేను భార్యనువిడిచి సన్యాసినై తిరిగెదను. వలదని మొదటనే చెప్పితిని. నన్ను మరపించి పరిణయము సేసితివి. నేను జెప్పలేదనుకొనవద్దు. ఇప్పుడే లేచిపోవుచున్నవాడనని బాల్యచాపల్యంబున బలికితిని.

పుత్రవత్సలుండైన బలదేవుడు నామాటలువిని విచారింపుచు నాయనా! నీవు తొందరపడకుము. భగవద్వచనమెప్పుడును దబ్బరకాదు. మరికొన్ని దినములు నిరీక్షింపుము. నీవిషయమై మరల స్వామి నారాధించి తెలిసికొనియెదనని నాకు బోధించి యారాత్రి చక్రపాణి నాత్మసన్నిధానము గల్పించుకొని నాయందలి ప్రేమాతిరేకం