పుట:కాశీమజిలీకథలు -02.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్రుని కథ

151

తరువాత జయంతుడీ వార్త యంతయు విని నాయొద్దకువచ్చి గ్రుచ్చి గ్రుచ్చి యడిగెను. కాని నే నేమియుజెప్పక మొదట జెప్పినదే సత్యమని పలికితిని. నీవు వెళ్ళిన తరువాత జరిగిన విశేషమిది. ఇటుపైన నాభారమంతయు నీమీద నున్నది. ఇక నన్ను ముంచినను యుద్ధరించినను నీవేకాని మఱియెవ్వరును లేరు. నీ జగన్నాథస్వామి యనుగ్రహమిప్పుడు కనబడవలయును. నామాటలేమియు నసత్యము గాకుండునట్లు చెప్పవలయు. శోకావేశముచే వ్రాసితిని తప్పులుండిన క్షమింపవేడెదను.

నీ ప్రియురాలు,

తిలోత్తమ.

అనియున్న యుత్తరమును పలుమారు చదువుచు దాని యధైర్యమును గురించి యెడదబొడమిన దుఃఖసముద్రము పైకి వెడలుచున్నదో యనునటుల జటెలముగా నయనములనుండి యశ్రుజలంబులుగార నాయుత్తరమును తడిపితిని.

ఆ చిలుకయు నెంత తెలివి గలదియో చూడుము. నేనాయుత్తరము చదివి నంతసేపును దూరముగానుండి ముగించినతోడనే నాదాపున వ్రాలి ప్రత్యుత్తరమిమ్మని యడిగినట్లు నటింప దొడంగినది. దాని యభిప్రాయమును గ్రహించి నేనాయుత్తరము మీదనే నీవిందులకు జింతింపకుము. మనపాల జగన్నాథస్వామి గలడు. నీ కెంత మాత్రము నవమానము రానీయను. నీయుత్తరముచూచి మిక్కిలి పరితపించుచున్న వాడ. నిది త్రికరణపూర్వకముగా జెప్పినమాట నమ్ముము సంతోషముగా నుండుము. ఇంతకన్న వ్రాయుట కవకాశము లేదని యొక ఫలరసముతో వ్రాసిమడచి యాయుత్తర మాచిలుక ముక్కున కందిచ్చితిని. అప్పతంగ మప్పత్రిక మప్పినట్ల ముక్కునం గరచుకొని రివ్వున నెగిరిపోయినది. ఇంతలో దేవదూతలువచ్చి యింద్రుడిప్పుడు సభ జేసియున్నవాడు. మనమచ్చటికి బోవలయులెమ్మని పలుకుచు నాక్షణము నన్ను దేవసభలోనికి దీసికొనిపోయిరి.

అప్పుడు దేవేంద్రునిం జూచి నేను సాష్టాంగనమస్కారము చేయుచు సభ్యుల కందరకు మ్రొక్కి మోడ్పుచేతులతో నెదుర నిలువబడితిని. ఆయన ప్రక్కను బృహ స్పతిగారు కూర్చుండిరి. నన్ను జూచి యాసభ్యులందరు నాశ్చర్యపడుచున్నట్లు వారి మొగములం జూడ నాకు దోచినది. తరువాత దేవగురుండు దేవేంద్రుని యనుమతి నా కిట్లనియె. నీవెవ్వడవు? నీ పేరేమి? నీ కాపుర మెచ్చట? నీ వెప్పుడైన నింతకు బూర్వ మీ స్వర్గమునకు వచ్చితివా? యని యడుగగా నేనిట్లంటి. అయ్యా! నా పేరు రుచికుడు. నా కాపురము శ్రీజగన్నాథము. స్వామి భక్తుడైన బలదేవుని కుమారుండ. నేను మిక్కిలి