పుట:కాశీమజిలీకథలు -02.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150

కాశీమజిలీకథలు - రెండవభాగము

దిలోత్తమయు నెద్దియో యేకాంతమాడుచుండ నేను జూచితిని. అప్పుడు మరియెవ్వరు నచ్చటలేరు. ఇరువురు మాటలాడుకొనుచుండ బోవుట తప్పని నేను దరికిబోక వేరొక మార్గంమునం బోయితిని. తరువాత నొకప్పుడు నందునితో నీవు మొన్నను తిలోత్తమతో నెద్దియో రహస్యముగ మాటాడుచుంటి వది యేమని యడిగితి.

అతడది వేరొక సంగతియని నా కుత్తరము జెప్పెను. ఇదియేనేనెఱుగునది యని యాసాక్షి చెప్పెను. అప్పుడింద్రుడు శిరఃకంపనముజేయుచు మంచిది నందా! మరియుం దర్కించినంగాని నీ మాటనమ్మము. మరియెవ్వరేని యప్పుడు చూచితిరేమో యీ పురమున నరసిరమ్ము . పొమ్మనిపలుకగా వాడు వగచుచు నప్పుడు పట్టణములోనికి బోయి కనంబడినవారినెల్ల నడుగుచు గొంతసేపటికి నలుగురు మగువల దీసికొని వచ్చి యింద్రు నెదురబెట్టి అయ్యా! మొదటవాడు నాకు స్నేహితుడని త్రోసివేసిరి. ఈ కాంతల నే నెన్నడు నెరుగను. వీరినడుగుడు. అని చెప్పగా విని యింద్రుడు నాసుందరుల మిరీనడుమ నెక్కడనేని యీయూరిలో దిలోత్తమంజూచితిరా యనియడుగగా నందు ముందుగా నిరువురు పడతు లతనికి మొక్కుచునిట్లనిరి.

దేవా! మేము నందనవనపాలికలము. దేవరవారిని రక్తాక్షుడు జెఱగొని పోయినప్పుడు మేమువెఱచి పొదరిండ్లలో దాగియుండగా దిలోత్తమ యొక చక్కనిపురుషునితో నీ వనములో విహరించినది. అప్పుడు మేము దగ్గరకుబోయి యితడెవ్వడని యడిగిన నవ్వుచు నొకపుణ్యపురుషుడని జెప్పి వానితోగూడ బట్టణములోనికి బోయినది. ఇది మాకన్ను లార జూచితిమని జెప్పిరి. వారిమాటలు సత్యములని యింద్రునికి దోచినవి. తక్కుంగల చక్కెరబొమ్మలును దిలోత్తమ యొకచక్కని పురుషునితో వీధింబడి పోవుచుండ గొన్ని దినముల క్రిందట మేము చూచితిమని చెప్పిరి.

అప్పుడు దేవేంద్రుడు మిక్కిలి కోపముతో నన్ను బిలిచి యేమే! తిలోత్తమా! నీవేమో యుత్తమురాల వనుకొంటిని. వీరి మాటలన్నియును వింటివా? దీనికి నీవేమి చెప్పెదవు? ఎద్దియో పన్నితివే? ఈ మర్మమంతయు నీయందున్నది. నిజము చెప్పుము. ఆ రుచికుడెవ్వడు? స్వర్గమున కెట్లు వచ్చెను అని నన్నడుగగా నేను సమ్మతింపక వారు చెప్పిన మాటలన్నియు నసత్యములనియు నవి యేమియు నేనెరుగననియు వారెవ్వరిని జూచి నేనని! భ్రమసిరో, నేను మొదట జెప్పినదే సత్య మనియు రూఢముగా బలికితిని. అంతట నింద్రుడు కన్నులెర్రజేసి నన్ను జూచుచు దిలోత్తమా! నీకున్న మర్యాదయంతయు బోగొట్టుకొనుచున్నదానవు. కానిమ్ము. ఆ రుచికునే యిచ్చటికి రప్పించి యడిగెద నప్పుడైనను నిక్కము తెలియకపోదని పలుకుచు మమ్ము నందరిని పొండని యానతిచ్చి యంతఃపురమునకు బోయెను,