పుట:కాశీమజిలీకథలు -02.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

148

కాశీమజిలీకథలు - రెండవభాగము

కలుగునని వేడుకొంటిని. కాని వారేమియు మాటాడిరికారు. ఏమాటయు జెప్పకయే వారు నన్ను స్వర్గమునకు దీసికొనిపోయిరి. నేనును దేవేంద్రునితో నేమని చెప్పుదును. తిలోత్తమమాట జెప్పిననొకతప్పు. చెప్పకున్న నొక తప్పు. అచ్చట నేమి జరిగినదో తెలియదు. ఇంతచింతయేల దైవమేమి తోపించిన నట్లు చెప్పువాడనని తలచుచు స్వర్గ పట్టణమువీథినుండి పోవుచుంటిని.

ఆ సమయమున నింద్రుడు శివపూజ సేయుచున్న వాడు కావున నవసరమైనది కాదు. అంతవరకు నన్ను వారొక బందీగృహములో నుంచిరి. అదియు భూలోకములోనున్న కారాగృహమువలె దుర్గంధాంధత మస్సంవృతంబైయుండక యున్నతమగు ప్రహరిచే నొప్పుచు లోన నొక భవనముచట్టును మిక్కిలి వింతలగు పుష్పజాతులు ఫలజాతులుంగలిగియున్నది. మనలోకములో రాజభవనమైనను నట్లుండదు. అచ్చట దప్పుచేసినవారిని దానిలో నుంతురట. ఎట్టి శిక్షయో చూడుము గోడమీద వ్రాసిన ప్రకటనను బట్టి యది కారాగృహమని తెలియబడినది.

వారు నన్నట్లు దానిలోబెట్టి కొందరు ద్వారమునందు గావలియుండి మరికొందరు పురందరుని కావర్తమానము తెలియబరుచుటకు బోయిరి. అట్టిసమయమున నేనేమియుందోచక యత్తోటలో గ్రుమ్మరుచుంటిని. అప్పువ్వులతోటలో నేను సంచరింపుచున్న సమయంబున నంతలో నంతరిక్షమునుండి యొకచిలుకవచ్చి నామ్రోల వ్రాలినది. దాని నుద్యానవనశుకమేయని యంతశ్రద్ధగా బరీక్షించితికాను. అదియు నన్ను విడువక నేనెచ్చటికిబోయిన నచ్చటికి వచ్చుచుండుటజూచి విమర్శింప దాని ముక్కున నెద్దియో పత్రికయున్నట్లు కనంబడినది. అప్పుడు దానిని పెంపుడుదానిగా గురుతుపట్టి పట్టుకొనబోయిన నదియు నేను జూచుచుండ దనముక్కున నొక్కి పట్టియున్న యుత్తరమును నామ్రోలవైచి కొంచెముదూరముగా నెగిరిపోయినది.

ఆయుత్తర మెద్దియోయని నేను బుచ్చుకొని విప్పినంత నది దేవభాషకాక మనుష్యలిపితోడనే యున్నది. దానింజదువగా నిట్లున్నది. ఆర్యా! నీవు వెళ్ళినది మొదలు నాకేమియు స్థిమితములేదు. ఇంద్రుడు బృహస్పతికిని నందునికిని వర్తమానము సేసెనని మున్ను నీకు జెప్పియుంటినికదా? వారిరువురును వచ్చినతరువాత నతండా యుత్తరము గురువుగారికి జూపించి యిది మనసభలో నుండుటకు గారణమేమియో యాలోచింపుమని యడిగెను. అతండును దానిం జదువుకొని యోహో! యిది భూలోకములోనున్న శ్రీజగన్నాధకాపురస్తుడగు రుచికుడను మాలికాకారునికి నొక వారకాంత తనకు గొన్ని పూవుదండలు కావలయునని వ్రాసినటులున్నది. ఈయుత్తర మిచ్చట నుండుట శంకనీయమేయని పలికెను. నింద్రుడు నందుని నిర్బంధించి యోరీ! మేము