పుట:కాశీమజిలీకథలు -02.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్రుని కథ

147

నది నిష్కారణముగా నిన్నిడుములబెట్టినవాడనైతినే కటకటా! యని పలుకుచు గన్నులనీరు గార్చినంజూచి యా చిగురుబోడియు విచారించుచు నేనేమి చేయుదును. నన్ను మించిన యాపద రాబోవుచున్నది. నిన్ను విడుచుట నాకు బ్రాణముల విడుచుటకంటె గష్టముగానున్నది. అయిన నీకు మంచిసౌఖ్యము గలుగజేసెదను. లెమ్మని పలుకుచు నన్ను బ్రచ్ఛన్నముగా విమానశాలయొద్దకు దీసికొనిబోయి యొక విమానముపై నెక్కించి యరగడియలో భూలోకమునకు దీసికొనివచ్చినది

నన్నొక మేడదాపునకు దీసికొనిపోయి యల్లదిగో! ఆమేడమీద దిలోత్తమ యను రాజపుత్రికయున్నది. ఆ చిన్నది విద్యారూపసౌకుమార్యంబుల నన్ను మించి యున్నది. నీకు దానివలన సుఖంబు గలిగెడిని పొమ్ము. నేను పోయివచ్చెద అనుజ్జ యిమ్మని పలుకుచు ముద్దాడి విడచినది. తిలోత్తమయు నవ్విమానము దీసికొని స్వర్గమునకు నిర్గమించినది. పిమ్మట నేనామేడమీద సఖులతో గూడ వీణవాయించుచున్న యాయించుబోణింజూచి మోహించితిని. అమ్మగువయు నాయభిప్రాయమెరిగి చెలికత్తియలకు సన్న సేసినది. కాబోలు నా ప్రోయాండ్రందరు తొందరగా దలయొకపనిమీద బోయిరి. పిమ్మట జెప్పునదియేమి యా మానినియు నేనును మూడహోరాత్రము లేక దేహమెట్లట్లవర్తింపుచు గామక్రీడలం దేలితిమి. పెక్కేల నాదివసములో గులశీలనామంబు లొండొరుల నడుగుట నక్కేళీవిలాసంబులనడమ నవకాశము దొరికినది కాదు. అట్లు మూడుదినములు కామకేళిందేలి మూడవనాటిరాత్రి మృదుతల్పంబున నలసి సొలసి యక్కలికియు నేనును గాఢనిద్రా వశంవదులమైతిమి.

ఆహా ! దైవప్రయత్న మెట్టిదో చూడుము. అమ్మరునాడుదయమున లేచి చూచువరకు నేనాశయ్యయందలేను. నన్నెవ్వరో యెచ్చటికో తీసికొనిపోవుచుండిరి. యడిగితిని. వారు కొంతసేపటికి మేము దేవదూతలమనియు నింద్రుని యానతి నిన్ను స్వర్గమునకు దీసికొనిపోవుచున్నారమనియు జెప్పిరి. వారిమాటలు విని నేడు స్వర్గమున నెట్టియుపద్రవము పుట్టినదో! తిలోత్తమమాట నిజమే యైనది. దానినేమి బాధించు చుండిరోకదా! కటకటా! ఇంద్రుడు నన్నేమిచేయించునో యని పెక్కు తెఱంగుల దలపోయుచు వారితో నిట్లంటిని.

అయ్యా! దేవదూతలారా! మీకు వందనములు సేసెదను. ఇంద్రుడు నన్నేమిటికి దీసికొనిరమ్మనెను. దేవలోకములో నావార్త వచ్చుటకు గారణంబేమి? మీతో నింద్రుడు నన్ను దీసికొని రండని చెప్పినప్పు డచ్చట నెవ్వరుండిరి. మరియు నేమమిప్రసంగము జరిగినది నిక్కమువక్కాణింపుడు. మీకు నార్తులరక్షించిన పుణ్యము