పుట:కాశీమజిలీకథలు -02.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

కాశీమజిలీకథలు - రెండవభాగము

వచ్చుచున్నదని తొంగిచూచుచు నీరీతి నొకయామము గడిపితిని. ఇంతలో నాయింతి నూర్పులు నిగుడవచ్చి తలుపు తీసింది. నేనును నెదురేగి సభావిశేషము లేమని యడిగిన నిట్లనియె.

ఆర్యా! వినుము నావార్త కుమారునివలన దేవేంద్రుడు విని నాకు వర్తమానము బంపెను. నేను వెళ్ళిన తరువాత నాదరపూర్వకముగనే నాకథయంతయును విని తానుగూడ విచారించెను. తరువాత నీరాత్రి నాటకములోనికి బొమ్మనికూడ నానతిచ్చెను. ఇంతవరకు జక్కగనే యున్నది. కాని మఱియొక చిక్కు తటస్థించునని యోజించుచున్నదాన నాతో నతడు మాట్లాడుచున్న సమయమున విజయుడను సుధర్మాభవన ద్వారపాలుడు వచ్చి దేవేంద్రా! నమస్కారము నేను సభాద్వారపాలుడను. ఈరాత్రి నాటకమాడుదురని యీసభయంతయు బరిశోధించి యలంకరింపుచుండ జింతామణిపీఠము వెనుక నీకాగితము దొరికినది. ఇందున్నది మనలిపికాదు. మనుష్యలిపివలె దోచుచున్నది. ఇట్టిది యీ సభలోనికి వచ్చుటకు గారణమేమో దేవరవారే యాలోచింపవలయునని పలుకుచు నా యుత్తరము చేతికిచ్చెను. దానింబుచ్చుకొని సకలభాషావేదియయిన దేవేంద్రుడు చదువగా బూవులదండలకయి నీ కెవ్వరో వ్రాసి నట్లున్నది. అప్పుడు దేవేంద్రుడు సందేహమందుచు నోహో! ఈరుచికుడెవ్వడు ఎచ్చటి జగన్నాథము ఈయుత్తర మీసభలో నుండుట మిగుల జిత్రముగా నున్నదేయని పెక్కుగతుల దలపోయుచు రెండవద్వారపాలకుడయిన నందునికి బృహస్పతికిని తక్షణమే సందేశము బంపెను. అంతవరకు విని నేను భయపడుచు నింద్రుని యనుమతి వడసి యిచ్చటికి వచ్చితిని.

ఆ యుత్తరము నీవచ్చట మరచితివి కాబోలు. ఇంక మనగుట్టు బట్టబయలు కాకమానదు. నందుని నిర్బంధించి యడిగినచో నాసంగతి చెప్పునేమో దానింబట్టి క్రమముగా నిజము లాగికొందురు. ఇదియుఁ గాక దివ్యజ్ఞానసంపన్నుడగు బృహస్పతి తలచుకొనిన నిజము దాగునా అందులకే బృహస్పతికిగూడ వర్తమానముచేసెను. ఇక నీవిచ్చటనుండిన మాటదక్కదు లెమ్ము నిన్ను భూలోకమునకు దీసికొనిపోయి దింపి వచ్చెదను. నీవు సుఖముగా నుండినజాలు. నా కర్మము నాయది మఱియు నీకొక్క మేలు గూర్చెదను. భూమిలో నొక రాజకుమారిత నా పేరనే యొప్పుచు రూపలావణ్యాదుల నన్ను బోలి సామాన్యుని బెండ్లియాడనని పట్టుపట్టియున్నది. మొన్నటి ప్రయాణములో నేను దాని వృత్తాంతము వింటిని. దానికి నీవు దగినవాడవు దానిమేడమీద నిన్ను విడచివచ్చెదను. దానితో సుఖముగా నుండుము లెమ్ము, మరల నేను వేగిరముగావచ్చి నాటకమున కందుకొనవలయునని పలుకగా విని అయ్యో! యెంత ప్రమాదము వచ్చి