పుట:కాశీమజిలీకథలు -02.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్రుని కథ

145

మాత్రము బయలుసేయకుము తీగిలాగిన డొంక గదిలినట్లు నీవృత్తాంతము మూలమున నాగుట్టు వెల్లడియగుచున్నది. నీవార్త మఱియొకలాగున జెప్పుము మొదటికథ తెలియ నీయక నందనవనమునకు విహారార్ధమై పోవునప్పుడు రక్కసుడు చెఱగొనిపోయెనని నుడువుము అని చెప్పి యతం డరిగిన వెనుక రంభోర్వసులు వచ్చియున్నారని పరిచారిక వచ్చి చెప్పినది. అప్పుడు వారికెదురేగి తీసికొని వచ్చినది.

వారిరువురు దానిం గౌగలించుకొనుచు ఏమీ ప్రాణసఖి? నిన్నెవ్వడో రక్కసుడు చెఱగొని తీసికొనిపోయెనట. మాకు దెలియలేదె యెంత ప్రమాదము నీవు నిన్న బృహస్పతిగారి యింటికి రాకున్ననేమోయని యూహించితిమి ఈమాట దెలియక యాయన నీవూరక రాలేదని కోపముజేసెను. అని చెప్పిన దిలోత్తమయు వారికి దగినట్లుత్తరము చెప్పినది నేనొక సందునుండి వారిద్దరిని జూచితిని. చంద్రలేఖా! వారి సౌందర్య మేమనిచెప్పుదు. వారేకదా లోకములో సౌందర్యమునకు నవసానభూతులని జెప్పదగినవారు. వారింజూచినప్పుడుగదా కన్నులు గలిగినందులకు ఫలము! వారి యవయవము లీరీతిగా నున్నవని చెప్పనవసరములేదు. శాస్త్రములో నుత్తమమత్తకాశినుల కెన్ని లక్షణములు చెప్పబడెనో యంతకన్న కొన్ని మిన్నగానే యున్నవి.

నేను దదేకదృష్టిగా వారియవయవము లన్నియు విమర్శింపుచుంటిని. వారు మరల దిలోత్తమతో సఖీ! యీరాత్రి నాటకములోనికి వత్తువా? నీభాగము మఱి యెవ్వరు వర్లింపలేదు. ఆ నాటకమునకు దిక్పాలురందరును వత్తురట మనము చక్కగా వినిపింపవలయునని పలుకగా దలద్రిప్పుచు దిలోత్తమ వారి కనుగుణ్యమగు మాటలం జెప్పినది. అట్టి సమయమునందు మఱియొక పరిచారికవచ్చి అమ్మా! ఇంద్రుడుగారు నిన్ను రమ్మనమని వర్తమానము బంపిరి. దేవదూతవచ్చి వాకిట నిలువబడియున్న వాడని చెప్పినది.

ఆ మాటలువిని తిలోత్తమ అక్కలారా! మీరు పదుడు నేను దేవేంద్రు నొద్దకు బోయివచ్చెద. రాత్రి తప్పక నాటకములోనికి వత్తునని పలికి ముందుగా వారిని సాగనంపి పిమ్మట నాయొద్దకువచ్చి యిట్లనియె. అనఘా! నీవు వీరిమాటలన్నియు వినుచుంటివికద. ఇప్పు డింద్రుడు వార్తనం పెను. నేనుబోయి యిప్పుడే వచ్చెదను. ఇచ్చటనే యుండుము. ఈలోని కెవ్వరును రాకుండ దాళము వైచిపోయెదను. నీకేమియు భయములేదని పలికి కదిలిపోయినది. నేనును నవ్వనిత లేనిసమయమందు నిముషమొక యుగముగా దలంచుచు నేమియుదోచక యాసౌధములో నలుమూలలు గ్రుమ్మరుచు నన్యులెవరేని వత్తురేమోయని వెఱచుచు నేమాత్రము రొదయైనను నదియే