పుట:కాశీమజిలీకథలు -02.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయంతుని కథ

139

నది. ఆరొద విని తిలోత్తమ జడియుచు నాచేయి పట్టుకొని చింతామణి పీఠముమాటునకు లాగికొని పోయినది. నేనును భయపడుచు నొకమందసము సందున దాఁగియుంటిని. మేమున్న చోటునకు గుప్తద్వారము దాపుననే యుండుటచే నచ్చటివారి మాటలు మాకీరీతి వినంబడినవి.

విజయుడు — నందా! ఈ రహస్యకవాటము తెరవబడియున్న దేమి శత్రువు లెవ్వరేనిఁ దెలిసికొని లోపల దూరలేదు కదా! నిన్ను సంతతము నిచ్చటఁ గాపుగా నుండమని మన ప్రభువు నియోగించెను గదా యేమి చేయుచుంటివి?

నందుడు -- విజయా ! ప్రమాదము వచ్చినది. కాపాడుము నేను సురాపానమత్తుండనై రతికేళిఁ జొక్కి యిక్కడకు రామరచితిని. ఈ సంగతి మనయేలికకు దెలిసెనేని శిక్షించును. నీవు గుప్తముగా నుంచుమీ.

విజయుడు - కడచినదానికి వగచినం బ్రయోజనము లేదుకదా దాని కేమి తెరచియుండుటకు గారణ మాలోచింపుము. ఇప్పుడు ఇంద్రుడుగారు వచ్చుచుండిరి. వెంటనే సభకు వేంచేయుదురట. సిద్ధముగా నమర్చియుండవలయును.

నందుడు - మనమే మరచియుండవచ్చును. ఈసంగతి శత్రువుల కెట్లు తెలియును. మన దేవేంద్రుని కెట్లు విజయము గలిగినదో చెప్పుము.

విజయుడు - విను మతనిం గట్టితీసికొనిపోయి రక్తాక్షుండొక బందీగృహములో నుంపించెను.

నందుడు - అయ్యో ! పాప మెంతవారి కెట్టి అవస్థ వచ్చినది. తరువాత.

విజయుడు - ఇంతలో జయంతుడు పోయి యా రేద్రిమ్మరి యేమరుపాటుగా నున్నతరి వానిపైబడి సంహరించెను. పిమ్మట రక్కసులందరు పారిపోయిరట.

నందుడు - ఓహో ! మన జయంతు డెంతపరాక్రమము చేసెను! మొదట గ్రామములో లేడాయేమి ?

విజయుడు - లేడు. ఎచ్చటికో విహారార్థ మరిగెను.

నందుడు – విష్ణుమూర్తి వచ్చి సహాయము చేసెనని యొకవదంతి పుట్టినదేమి?

విజయుడు — అదియు నుండవచ్చును. శ్రీహరికటాక్షములేక యెట్టివారికిని జయము కలుగదుగదా.

నందుడు - ఇప్పు డీసభకువచ్చి యేమిచేయుదురు.

విజయుడు - దిగ్విజయవిశేషములం జెప్పుకొని సంతసింతురు.