పుట:కాశీమజిలీకథలు -02.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

కాశీమజిలీకథలు - రెండవభాగము

శ్లో॥ శ్యామా కఫకృతికా బడబా మృగీవా
     గంధర్వయక్షసుర నిర్జర కన్యకావా
     బాలధవాభినవయౌవనభూషితాంగి
     సాభామినీభవభుజాంపరమంరహస్యం

దేవకన్యలలో నగ్రగణ్యయగు తిలోత్తమ సౌందర్యచాతుర్యాదివిశేషములు యౌవనలావణ్యములు క్రీడావినోదములు, మనోహరములని వేరచెప్పవలయునా ? ఆచేడయతో వేడుక లెంతకాల మనుభవించితినో చెప్పజాలను. గడియవలెనైనఁ దోచలేదు. కాని యింద్రుడు వచ్చి నాకపటము గ్రహించి నన్ను శిక్షించునేమోయను వెఱవు పానకములోఁబుల్లవలె నామదికిఁగఱకుగా నాటుచునే యున్నది.

మఱియు నానెలంత నేను గోరికొనిన నొక్కనాఁడు దేవసభఁ జూపింప నన్నుఁ దీసికొని పోయినది. అప్పటికి దేవేంద్రునిజాడ యేమియు దెలియలేదు. పురమంతయు నారీతినే యున్నది. అప్పుడప్పఁడతి నన్నొక ప్రచ్చన్నస్థలమునకుఁ దీసిగొనిపోయి యందున్న యొకమరఁద్రిప్పగా నొక తలుపు తెరవఁబడినది. ఆమార్గములోనికిఁ బోయితిమి. అదియొక గుహవలె నున్నది. కాని రత్నకాంతులచేఁ జీకఁటి యెంతమాత్రమునులేదు. నిరాటంకముగా నామార్గమునం బోవంబోవ నాదేవసభ గనంపబడినది.

ఆ దారి యింద్రుడు గూర్చుండెడి పీఠము వెనుకకుఁబోయినది. ఆ సభఁ జూచినంత నాస్వాంతమున నేవస్తువునకు మితిలేదని నిశ్చయించితిని. అందున్న ప్రతివిశేషమునుఁ జూచినదానికన్నఁ గ్రొత్తవింతగాఁ గనంబడుచుండెను. ఆ సభ చతురశ్రముగా యోజనోధ్రయము గలిగియున్నది. తూరుపుదెసఁ చింతామణియను పేరుగల యింద్రుని సింహాసనము నవరత్నఖచితమై యున్నది. ఇరుప్రక్కలను రత్నపీఠములు పెక్కురకముల నొప్పుచున్నవి. దక్షణోత్తరభాగములయందు దేవతలు గూర్చుండెడి పీఠములున్నవి. ఎదుర రంభాదుల నాట్యము జేసెడు రంగస్థలము మిక్కిలి వింతయగు నలంకారము గలిగియున్నది

దిక్పాలురును, మహర్షులును, బృహస్పతియు, నింద్రునిప్రాంతమందుగల పీఠములపైఁగూర్చుందురఁట. ఈపీఠములు శ్రేణిగాను క్రమక్రమోన్నతముగాను సుంపఁబడినవి. ఆ సభాలంకార మదివరకందు నేనుఁ జూచినదానికన్న వింతగానున్నది. పెక్కేల నచ్చట విశేష మొక్కొక్కటి జెప్పుటకుఁ పెద్దతడవు పట్టును చూచినదే పలు మారుచూచుచు, నడిగినదే పెక్కుసారు లడుగుచు, నీరీతి నాయాస్థానములోఁ గ్రుమ్మరుచుండగా నింతలో నాగుప్తద్వారమున నెవ్వరో మాట్లాడుచున్నట్లు వినంబడి