పుట:కాశీమజిలీకథలు -02.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

కాశీమజిలీకథలు - రెండవభాగము

మన దేశములో నుసిరికాయంత మణి దొరికిన నబ్బురముగా నుండును. అచ్చట నున్న శిలలన్నియు మణులే! రాజమార్గములన్నియు మణిఖచితములగుటచే నందు సౌధములు ప్రతిఫలించి యడుగునఁ గూడ పట్టణమున్నట్లు తోచును.

అట్టి వింతలంజూచి దారి తెలియక నేను దెల్లబోయి చూచుచుండ, నా యండజయాన నవ్వుచు నిలువంబడి యేమియది చూచుచుంటివి నా వెంటరావేయని యడుగఁగా నయ్యో! నీకును నాకును నడుమ ప్రవాహమున్నది. ఎట్లు దాటఁగలను. ఈ గట్టు దూకుటకు నే నోపుదునా? ఈ తలుపు మూసియున్నది ఎలాగున వత్తును. అని యీ తెఱంగునఁ బల్కుచుండ నా చేయి పట్టుకొని నీవు చూచినది మణికాంతి ప్రవాహము కాదు. రమ్ము రమ్ము. ఇది తలుపు కాదు. ప్రతిబింబము భ్రమయక చక్కగా నిదానించి చూడుము. ఇది దేవసభకుఁ బోవు రాజమార్గము. దీని ప్రక్కల నున్న మేడలు మిగుల గొప్పవి వీని విశేషములఁ బరిశీలింపుమని పలుకుచుండ నేనిట్లంటిని.

తిలోత్తమా! నీ పుణ్యము నా చేయి విడువకుము. ఎడమైనచో నీవును నాకుఁ గనంబడకుంటివి. క్రిందఁగూడ మేడలున్నవా యేమి? నా కేమియు దారి తెలియదు నిలునిలు అయ్యో! ఈ ప్రహరి నెట్లు దాటిపోయితివి. ఈ శ్రేణి యెచ్చటనుం గనంబడినదే? అని యిట్లు బలుకుచుండ అయ్యో! నీ కెన్నిమారులు చెప్పితిని, ఇది గోడకాదు. మణిశిలాప్రతిఫలితమగు సాలము తగులదు. రమ్మని పలికి క్రమంబున నా వీథులన్నియుం ద్రిప్పినది కాని నా కేమియునుఁ దెలిసినది కాదు. అప్పుడా మేడ తలుపులన్నియు మూయబడి యున్నవి. మొదట నా కెవ్వరునుఁ గనంబడలేదు గాని యా మేడఁ మీఁదనున్న సాలభంజకల జూచి దేవకాంతలని భ్రమయుచుండ నవి బొమ్మలని యది చెప్పి నా సందియము దీర్చినది.

అందున్న మానికపు బొమ్మలనుఁ గొమ్మలకును భేదముఁ గనిపెట్టుట మిక్కిలి దుర్ఘటనము. తరువాత నా నాతి నా భ్రమనంతయు నుడిపి చూడుమల్లదె పొడవుగానున్నది. జయబతమను పేరుగల యింద్రునిమేడ దానిదాపున నున్నది శచీగృహము. ఆ ప్రక్కది జయంతునిది. దానికిఁ దూర్పుదెసగా మెరయుచున్న సౌధములోనే సుధర్మయను పేరుగల దేవసభయున్నది. అవియే దిక్పాలుర గేహములని యందలి గృహవిశేషములన్నియు వేరువేర నిరూపించి చెప్పినది. నేను వానివిశేషముల కచ్చెరువందుచు ముందు నింద్రునిగృహములోనికిఁ దీసికొనిపొమ్మని కోరగా నది ఆర్యా! ఇప్పుడాగృహము వాకిలి మూయఁబడియున్నది. ప్రచ్ఛన్నమార్గము నేనెరుంగుదును. కాని యందనేక దేవతలు కాచికొని యుందురు. నిన్నుఁ జూచి శంకింతురు. కావున నచ్చటికిఁబోవలదు. ముందు మాయింటికిఁ దీసికొని పోయెదను. చూతువు గాని రమ్మనిపలుకగాఁ సంతసించితిని. ఆకాంత నన్నేకాంతమార్గమునఁ దనయింటికిఁ